కర్నూలులో కరెన్సీ ముఠా!
కర్నూలులో కొత్త కరెన్సీ ముఠా రెక్కలు విప్పిందా? వచ్చిన నగదును ప్రజలకు కాకుండా కొద్ది మంది పెద్దలకు భారీగా ఇచ్చేశారా? సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసిన తర్వాత కొద్ది మంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి కొత్త కరెన్సీని భారీగా తీసుకెళ్లారా? ఇందులో ఓ ప్రధాన బ్యాంకు ఉద్యోగి పాత్ర ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది.
భారీగా కొత్త నోట్ల మార్పిడి
- సూత్రధారి ఓ బ్యాంకు అధికారి
- గుట్టుగా సాగిన వ్యవహారం
- త్వరలో విచారణ జరిగే అవకాశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలులో కొత్త కరెన్సీ ముఠా రెక్కలు విప్పిందా? వచ్చిన నగదును ప్రజలకు కాకుండా కొద్ది మంది పెద్దలకు భారీగా ఇచ్చేశారా? సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసిన తర్వాత కొద్ది మంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి కొత్త కరెన్సీని భారీగా తీసుకెళ్లారా? ఇందులో ఓ ప్రధాన బ్యాంకు ఉద్యోగి పాత్ర ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. అంతకు క్రితమే సదరు అధికారి నకిలీ నోట్లను ఏటీఎంలో పెట్టారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పాత నోట్ల రద్దు ప్రకటన తర్వాత రెండు, మూడు రోజుల్లోనే భారీగా కొద్ది మంది వ్యక్తులకు అందించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలులో కరెన్సీ ముఠా వ్యవహారంపై విచారణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే, జరిగిన వ్యవహారంపై ఏ ఒక్క బ్యాంకు అధికారి కానీ నోరు విప్పేందుకు అంగీకరించడం లేదు. పైగా భారీ మొత్తంలో నగదు చేతులు మారే అవకాశం లేదని సమాధానమిస్తున్నట్టు తెలుస్తోంది.
నకిలీ కరెన్సీలోనూ చేయి
వాస్తవానికి ఈ బ్యాంకు అధికారి వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త కరెన్సీని మార్పించడంతో పాటు అంతకు ముందు నకిలీ నోట్లను కూడా ఏటీఎంలో పెట్టేవాడనే విమర్శలు ఉన్నాయి. అనేక సమయాల్లో బ్యాంకుకు అనుబంధంగా ఉన్న ఈ ఏటీఎం నుంచి నకిలీ నోట్లు వచ్చాయనే ఫిర్యాదులు వినియోగదారుల నుంచి వచ్చాయి. అయితే, బయటి నుంచి తీసుకొచ్చారంటూ కొద్ది మంది బ్యాంకు సిబ్బంది వారిని వెనక్కి తిప్పి పంపినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు కొద్ది రోజుల ముందు నకిలీ నోట్లు వచ్చాయంటూ ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేశారని సమాచారం. బయట నుంచి తీసుకొచ్చావేమోనని బ్యాంకులోని కొద్ది మంది సిబ్బంది యథావిధిగా వెనక్కితిప్పి పంపే ప్రయత్నం చేయగా.. సీసీ ఫుటేజీ చూసుకోవాలని సదరు వినియోగదారుడు సీరియస్‌గా బదులిచ్చాడు. దీంతో ఈ వ్యవహారం బయటపడకుండా..నకిలీ నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చారనే ప్రచారమూ జరుగుతోంది. సదరు అధికారి తీరును తెలిసినప్పటికీ బయటకు చెప్పేందుకు మాత్రం బ్యాంకు సిబ్బంది భయపడుతున్నట్టు సమాచారం.
కర్నూలులోనూ విచారణ...?
ఇప్పటికే కొత్త కరెన్సీ నోట్లను భారీ మొత్తంలో కొద్ది మందికి బదిలీ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు కర్నూలులో కూడా ఈ తరహా వ్యవహారం జరిగిందనే సమాచారం ఉంది. కర్నూలులో జరిగిన వ్యవహారంపై విచారణ జరిపేందుకు కేంద్రం నుంచి అధికారులు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రధాన బ్యాంకులో నోట్ల చెస్ట్ వ్యవహారాలను చూసే అధికారి పాత్ర ఇందులో ఉందనే వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి. ఈయన ద్వారా భారీగా కొత్త నగదు పొందిన కొద్ది మంది వ్యక్తులు ఇతర బ్యాంకు ఉద్యోగుల వద్దకు కూడా వెళ్లి కొత్త నగదు ఇస్తారా... కమీషన్ ఇస్తామని వాకబు చేసినట్టు కూడా తెలుస్తోంది.