‘మిషన్’కు నెర్రెలు | Crumbling Work of mission Kakatiya | Sakshi
Sakshi News home page

‘మిషన్’కు నెర్రెలు

Jul 4 2016 10:45 AM | Updated on Sep 4 2017 4:07 AM

చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పనులు జిల్లాలో తూతూ మంత్రంగానే సాగుతున్నాయనే విమర్శలున్నాయి.

 ఒక్క వానకే దెబ్బతిన్న చెరువులు
 నామమాత్రంగా పునరుద్ధరణ పనులు
 రెండో విడతలో 177 చెరువుల పనే పూర్తి
 ఖమ్మం అర్బన్:

 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పనులు జిల్లాలో తూతూ మంత్రంగానే సాగుతున్నాయనే విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక నాణ్యత లేకుండా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రెండో విడతలో చేపట్టిన పనులు నాసిరకంగా ముగిశాయి. ఇటీవల కురిసిన వానలకు పలుచోట్ల చెరువు కట్టలు నెర్రెలుబారుతుండడంతో నాణ్యత డొల్లేనని తేలింది. ఈ కట్టలను చూసిన రైతులు ఒక్క వానకే ఇలా నెర్రెలిస్తే సంవత్సరాల పాటు బలంగా ఎలా ఉంటాయి..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


 రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి చెరువు కట్ట పనుల్లో నాణ్యత లేక మొత్తం నెర్రెలు బారింది. తూము వద్ద కూడా నీళ్లు లీకవుతున్నాయని రైతులు అధికారులకు ఫిర్యాదు  చేశారు. అనేక చెరువుల్లో పూడికతీత పనులు నాసిరకమే. ఇప్పుడు వాననీరు చేరడంతో లెక్కలు తేల్చాల్సిన పనిలేకుండాపోవడంతో కాంట్రాక్టర్లకు వరంగా మారింది. కట్టల నిర్మాణంలో ఎప్పటికప్పుడు రోలింగ్ చేయాల్సి ఉన్నా అలా చేయకపోవడం వల్లనే నెర్రెలొస్తున్నాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. చెరువుల పునురుద్ధరణ పనుల్లో నాణ్యత లేదని, కంపచెట్లు తొలిగించడంలేదని, పూడిక పూర్తిగా తీయడం లేదంటూ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు సైతం వివిధ మండలాల నుంచి గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి.


 అంతా అరకొరగానే..
 జిల్లాలో మొత్తం 916 చెరువుల్లో పని పూర్తి చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు 177 చెరువుల్లో పనులు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 14 చెరువులకు గాను ఒక్కటీ పూర్తి కాలేదు. అంచనా కంటే ఎక్కువ మట్టి పోయడం, రోలింగ్ లేకపోవడం వల్లే కట్టలు నెర్రెలు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి విడతలో మొత్తం 833 చెరువుల్లో పనులు మొదలుపెడితే 804 చెరువుల పనులు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. క్వాలటీ కంట్రోల్ విభాగం ఉన్నా..తనిఖీలు, నివేదికలపై దృషి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.


 నాణ్యతలో రాజీపడం..
 అక్కడక్కడా చెరువు కట్టల పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. నాసిరకంగా నిర్మిస్తే సహించం. నాణ్యతలో రాజీపడం. పనులను క్షుణ్ణంగా పరిశీలించే బిల్లులు చేస్తాం. పని పూర్తయినా..మరో ఏడాది పాటు ఫైనల్ బిల్లులు ఉంటాయి. దెబ్బతిన్న పనులను పూర్తి చేయించుతాం.    -వి.రమేష్, ఎస్‌ఈ



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement