అవినీతి.. షరా ‘మామూలు’ | corruption in revenue deportment | Sakshi
Sakshi News home page

అవినీతి.. షరా ‘మామూలు’

Jul 30 2016 7:06 PM | Updated on Sep 22 2018 8:22 PM

అవినీతి.. షరా ‘మామూలు’ - Sakshi

అవినీతి.. షరా ‘మామూలు’

రెవెన్యూ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. పట్టాదారు పాసు పుస్తకాలు మొదలుకుని, భూములుఆన్‌లైన్‌లో చేర్చడం వరకు అక్రమాలకు నిలయంగా పేరు పొందిన ఈ శాఖ ఇప్పుడు ఇసుకలోనూ తాయిలాన్ని పిండుతోంది.

చెన్నూరు :
రెవెన్యూ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. పట్టాదారు పాసు పుస్తకాలు మొదలుకుని, భూములుఆన్‌లైన్‌లో చేర్చడం వరకు అక్రమాలకు నిలయంగా పేరు పొందిన ఈ శాఖ ఇప్పుడు ఇసుకలోనూ తాయిలాన్ని పిండుతోంది. ఇటీవల కాలంలో భారీ ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు వినవస్తున్నాయి. చెన్నూరు అధికారులు వారం రోజుల్లోనే ఇసుక ట్రాక్టర్‌ల వద్ద రూ. 95 వేలు
అక్రమంగా వసూలు చేసి తమ సత్తా ఏమిటో చూపారు. ఓ మండల స్థాయి అధికారితో పాటు, మరో ద్వితీయ శ్రేణి అధికారి ఇసుక దందాకు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు ఇద్దరిని మధ్యవర్తులుగా, తమ బినామీలుగా ఏర్పరచుకొని వారి ద్వారా ఈ దందాను కొనసాగిస్తూ.. కడపలోని ఓ హోటల్‌ కేంద్రంగా  పంపకాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలు టార్గెట్‌
రెవెన్యూ కార్యాలయంలో ఒక నెలకు రూ. 3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అక్రమ వసూళ్లు చే యాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. ఇటీవల మండలంలోని ఓ రైతు తమ పొలాన్ని ఆన్‌లైన్‌ చేయాలని కోరితే రూ. 80 వేలు మామూళ్లు అడగడంతో కంగుతిని చేసేది లేక మిన్నకున్నాడు. చెన్నూరుకు చెందిన రైతు తన బంధువులు కొనుగోలు చేసిన భూమిని ఆన్‌లైన్‌ చేయాలని కోరితే రూ. 10 వేలు మామూళ్లు తీసుకొన్నారు. సదరు రైతు తొలుత మామూళ్లు ఇచ్చేందుకు తిరస్కరించినా కార్యాలయం చుట్టూ ఏళ్లతరబడి తిరగలేక మామూళ్లు సమర్పించి పని చేయించుకున్నట్లు తెలుస్తోంది.  గత నెల 6 వతేదీన మండలంలోని కొక్కరాయపల్లెకు చెందిన వ్యక్తి ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తూ పట్టుబడితే రూ.35 వేలు లంచం తీసుకొని వదిలేశారు. అదే గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తూ పట్టుబడితే అతని వద్ద రూ. 16 వేలు వసూలు చేశారు. ఇటీవల ముగ్గురు రైతులు  నదిలోని ఒండ్రుమట్టి పొలానికి తోలుతుంటే మూడు ట్రాక్టర్‌లను పట్టుకొని రూ.18 వేలు తీసుకొన్నారు. ఈనెల
22వతేదీ శుక్రవారం ఇసుక ట్రాక్టర్‌ పట్టుబడగా ఆదివారం వరకు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచి రూ.10 వేలు తీసుకొని పంపారు. 24వ తేదీన శివాలపల్లె వద్ద 2, చెన్నూరు వద్ద రెండు ట్రాక్టర్లు పట్టుకొని 26వతేదీవరకు స్టేషన్‌లో ఉంచి ఒక్కో ట్రాక్టర్‌ నుంచి రూ. 15 వేల చొప్పున రూ.60 వేలు వసూలు చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు. ఈనెల 22న బుధవారం ఉదయం ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని
స్టేషన్‌లో అప్పగించి మధ్యాహ్నం వదిలేశారు. ఇలా ఒక్కటేమిటి ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి అందినకాడికి దండుకొంటున్నారనే విమర్శలున్నాయి.

కాగా, ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఈనెల 22 వతేదీ నుంచి 27 వరకు ఆరు ట్రాక్టర్లు పట్టుకొని తమకు అప్పగించారని, మూడు రోజులు స్టేషన్‌లో ఉంచుకొన్నాక రెవెన్యూ అధికారి పంపమంటే తాము పంపామని వారు చెప్పారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారిస్తే ఈ మామూళ్ల దందా బహిర్గతమవుతుంది. ఈ విషయంపై తహశీల్దార్‌ సత్యానందంను వివరణ కోరగా ట్రాక్టర్‌లు పట్టుకొన్నది వాస్తవమేనని, తాము ఎవ్వరి వద్ద మామూళ్లు తీసుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement