ఇసుక దోపిడీ సహించం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy says We will not tolerate sand mining | Sakshi
Sakshi News home page

ఇసుక దోపిడీ సహించం: సీఎం రేవంత్‌

May 28 2025 1:08 AM | Updated on May 28 2025 1:08 AM

CM Revanth Reddy says We will not tolerate sand mining

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి, సీఎస్‌ రామకృష్ణారావు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్‌ ద్వారా ఉచితంగా సరఫరా చేయాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం 

ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి.. కలెక్టర్లు మరింత ప్రో యాక్టివ్‌గా ఉండాలి 

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు వివరించాలి..

దుష్ప్రచారం తిప్పికొట్టాలి.. 

రుతుపవనాలు ముందే వచ్చాయి..

సాగు ఏర్పాట్లు పర్యవేక్షించండి 

కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రులు రేపు,ఎల్లుండి క్షేత్రస్థాయికి వెళ్లాలి 

భూ భారతిపై 3 నుంచి సదస్సులు

రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. మరింత ప్రో యాక్టివ్‌గా (చురుగ్గా) ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ జరగకుండా చూడాలి. లబ్ధిదారులకు టోకెన్‌ జారీ చేసి ఉచితంగా సరఫరా చేయాలి. ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న సంఘటనలు కూడా విస్తృత ప్రచారంలోకి వస్తున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లనే అని దుష్ప్రచారం జరుగుతోంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. 

కొన్ని రాజకీయ ప్రేరేపిత సంఘటనలూ జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎంవో నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయ శాఖ తదితర అంశాలపై.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ కె.రామకృష్ణారావులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

పరిహారం ప్రతిపాదనలు పంపండి 
‘పౌరసరఫరాల శాఖ గతసారి కంటే దాదాపు 22 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ) అధికంగా ధాన్యాన్ని, అదీ తక్కువ సమయంలోనే కొనుగోలు చేయడం అభినందనీయం. 10.50 లక్షల మంది రైతుల దగ్గర్నుంచి 64 ఎల్‌ఎంటీలకు పైగా ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేశాం. 

ఇప్పటివరకు రూ.12,184 కోట్లు చెల్లించాం. 90 శాతానికి పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి రుతుపవనాలు ముందే రావడంతో కల్లాల వద్ద ధాన్యం తడిసిపోయి కొంతమంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపాలి.  

రైస్‌ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి 
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు బలంగా జరుగుతున్నాయి. వీటిని తిప్పికోట్టాలి. జిల్లాల్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంది. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్లు వెల్లడించాలి. రైస్‌ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి. రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

జూన్‌ 1 నాటికి నివేదిక ఇవ్వాలి 
‘వర్షాలు ముందే వచ్చినందున వ్యవసాయ శాఖ ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉంచాలి. విత్తనాల, ఎరువులు అక్రమ నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రులు ఈ నెల 29, 30 తేదీలలో క్షేత్రస్థాయిలో వానాకాలం సాగు ఏర్పాట్లు పర్యవేక్షించాలి. నకిలీ విత్తనాలు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై నివేదిక తయారు చేసి జూన్‌ 1 నాటికి సమర్పిచాలి. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి..’ అని రేవంత్‌ ఆదేశించారు 

పేదలకు చుట్టంలా భూ భారతి చట్టం 
‘గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ ప్రజలను భూతంలా పీడిస్తే, భూ భారతి చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుంది. భూ భారతి చట్టం కోసం తొలుత 4 మండలాలనే పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నాం. తర్వాత ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్‌గా ఎంపిక చేసుకుని రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించాలి. 

పైలట్‌ మండలాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. జూన్‌ 3 నుంచి జూన్‌ 20 వరకు భూ భారతి సదస్సులు అన్ని మండలాల్లో నిర్వహించాలి. ఈ సదస్సుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. 
 
ధరల నియంత్రణ కమిటీలు నియమించండి 
‘ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో ప్రభుత్వ పనితీరు ఏంటో తెలుస్తుంది. కలెక్టర్లు ఈ కీలకమైన పథకం అమలు పర్యవేక్షించాలి. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను నియమించాలి. మేస్త్రీ చార్జీలు, నిర్మాణ పరికరాల ధరలపై నియంత్రణ ఉండాలి. 

అడ్డుగోలు ధరలతో పేదలను మోసం చేయకుండా జాగ్రత్త వహించాలి. మహిళా సంఘాలు, రాజీవ్‌ యువ వికాసం ద్వారా ఇటుక, సెంట్రింగ్‌ యూనిట్ల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తక్కువ ధరతో నాణ్యమైన ఇళ్లు నిర్మించేందుకు సాంకేతికంగా అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. వీటిని లబ్ధిదారులకు తెలియజేయాలి. మండల కేంద్రాల్లో నిర్మించిన మోడల్‌ ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు పరిశీలించేలా కార్యక్రమాలు రూపొందించాలి..’ అని రేవంత్‌ చెప్పారు.  

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త 
‘ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. ముందుగా వచ్చే వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు ప్రబలే ప్రమాదముంది. వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. 

అన్ని జిల్లాల్లోనూ సీజన్‌కు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పారు. ముందస్తు సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement