వాటా ఇస్తేనే సంతకం


► పర్సంటేజీ ఇవ్వకపోతే బిల్లుల్లో జాప్యం చేస్తున్న అధికారి

► కాళ్లరిగేలా తిరుగుతున్న కాంట్రాక్టర్లు

 

నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు చేతులు తడిపితేనే పని జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే కార్పొరేషన్‌ ఆడిటింగ్‌ విభాగంలో ఓ అధికారి కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నారు. తనకు రావాలి్సన పర్సంటేజీలను అడగకముందే ఇస్తే రెండు రోజుల్లో సంతకాలు చకచక జరిగిపోతున్నాయి. పర్సంటేజీలు చెల్లించకపోతే కొర్రీలు పెడుతూ ఆ అధికారి జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

రెండుసార్లు ఫైళ్లు తెప్పించుకుంటున్న వైనం

కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేసిన అనంతరం ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించి నోట్‌ ఫైల్‌ను తయారు చేశారు. ఆ తర్వాత ఆడిటింగ్‌ విభాగంలోని అధికారి పరిశీలించి అకౌంట్స్‌ విభాగానికి పంపుతారు. చివరికి కమిషనర్‌ బిల్లులను మంజూరు చేస్తారు. అయితే కమిషనర్‌ పరిశీలన అనంతరం కూడా ఆడిటింగ్‌ విభాగంలోని అధికారి తిరిగి మళ్లీ ఫైల్‌ను తన చాంబర్‌కు తెప్పించుకుంటున్నారని సమాచారం. పర్సంటేజీ ఇవ్వని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 

 

ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు

ఆడిటింగ్‌ విభాగంలోని ఇద్దరు అధికారుల మధ్య పర్సంటేజీల వివాదం నడుస్తోంది. రూ.లక్ష లోపల పనులకు సంబంధించిన బిల్లులకు అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ సంతకాలు చేస్తున్నారు. రూ.లక్షకు పైబడిన బిల్లులకు అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు సంబంధం లేకుండా ఫైళ్లపై ఎగ్జామినరే సంతకాలు చేస్తున్నారు. దీంతో వీరి మధ్య పనుల పంపకాలపై ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. మరోవైపు పర్సంటేజీలను డిమాండ్‌ చేయడంపై కాంట్రాక్టర్లు కమిషనర్‌ ఢిల్లీరావుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇంజినీరింగ్, అకౌంట్స్, ఆడిటింగ్‌ విభాగాలకు పర్సంటేజీల రూపంలో చెల్లిస్తే తాము నాణ్యమైన పనులను చేయలేమని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top