'ఇక్కడి నుంచే టీఆర్ఎస్ అంతం' | Congress to hold Rythu Garjana in Adilabad | Sakshi
Sakshi News home page

'ఇక్కడి నుంచే టీఆర్ఎస్ అంతం'

Aug 17 2016 1:02 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ఇక్కడి నుంచే టీఆర్ఎస్ అంతం' - Sakshi

'ఇక్కడి నుంచే టీఆర్ఎస్ అంతం'

రైతులు పిడికిలి బిగిస్తే కేసీఆర్, టీఆర్‌ఎస్ సర్కార్ ఖతమవుతుందని, ఇది ఆదిలాబాద్ నుంచే ఆరంభమవుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

 
 రైతు గర్జన , కాంగ్రెస్, టీఆర్ఎస్ , రైతులు
 హెచ్చరించిన కాంగ్రెస్ జాతీయ, రాష్ర్ట నేతలు
 ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతు గర్జన సక్సెస్
 హాజరైన దిగ్విజయ్‌సింగ్, కుంతియా, టీపీసీసీ నేతలు
 రైతుల పక్షాన గర్జించిన కాంగ్రెస్ నాయకులు
 
ఆదిలాబాద్ : రైతులు పిడికిలి బిగిస్తే కేసీఆర్, టీఆర్‌ఎస్ సర్కార్ ఖతమవుతుందని, ఇది ఆదిలాబాద్ నుంచే ఆరంభమవుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. రైతులను విస్మరిస్తున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేర్చని ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నమైందని, మోసపూరిత ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల పక్షాన తాము నిలబడుతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ తీరుపై గర్జించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో కాంగ్రెస్ రైతుగర్జన బహిరంగ సభ జరిగింది. అంతకుముందు స్థానిక ఓ ప్రైవేటు హోటల్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
 
ఏఐసీసీ అగ్రనేతలు దిగ్విజయ్‌సింగ్, ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. బుధవారం సాగు నీటి ప్రాజెక్టులపై నిర్వహించనున్న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అనంతరం బహిరంగసభకు వచ్చిన అగ్రనేతలు డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన రెండు రోజుల దీక్షను విరమింపజేశారు. తర్వాత సభ స్థలానికి చేరుకుని సభకు హాజరైన రైతులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు.
 
 
రుణమాఫీలో విఫలం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీని అమలులో సర్కారు విఫలమైందన్నారు. 37 లక్షల మంది రైతులు పాసు పుస్తకాలు బ్యాంకుల్లో ఉండిపోయాయని, దీంతో అప్పు పుట్టక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన చెందారు.
 
నూకలు చెల్లినట్లే..
వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో రైతు సందోహం చూస్తుంటే ప్రభుత్వానికి ఇక్కడి నుంచే నూకలు చెల్లినట్లు కనిపిస్తోందన్నారు. ఈ గర్జనతోనైనా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
 
 రైతులకు కృతజ్ఞతలు
మాజీ హోంమంత్రి, జిల్లా ఇన్‌చార్జి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో రైతు గర్జనను విజయవంతం చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు కృషిచేసిన జిల్లా శ్రేణులు, డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డిని అభినందించారు.
 
 హామీల అమలు ఏదీ?
సీఎల్పీ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సోనియాగాంధీతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ వాగ్ధానాలను నమ్మి రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని, ఆ హామీల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
 
 పాపం పండుతుంది
ఎమ్మెల్సీ కోమట్‌రెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పాపం పండే రోజు ముందుందని పేర్కొన్నారు. నల్గొండలో నయూం ముఠా డైరీలో 99 శాతం టీఆర్‌ఎస్ నాయకుల పేర్లే ఉన్నాయని, భూదందాలు, సెటిల్‌మెంట్లు వారివేనని ఆరోపించారు.
 
 ‘డబుల్’ ఇళ్లు ఏవీ..?
గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ, ఎర్రవెల్లిలో మోడల్ డబుల్ బెడ్‌రూంలు తప్పితే రాష్ట్రంలో ఎక్కడా ప్రారంభం కాలేదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు చెప్పలేదు కాబట్టే అధికారంలోకి రాలేకపోయిందని పేర్కొన్నారు.
 
 మద్దతు ధర ఇవ్వాలి
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, పత్తికి రూ.5 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ ప్రభుత్వం రూ.2.33 వేల కోట్ల అప్పుతో ఉందని ఇది తలసరిగా రూ.10 వేల భారం పడుతుందని, అప్పుడే పుట్టిన బిడ్డలపైనా భారమేనని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement