
సీఎం వస్తారు.. సిద్ధం కండి!
హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నారని, అందుకు అధికారులు సమాయత్తం కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జెడ్పీసెంటర్ : హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నారని, అందుకు అధికారులు సమాయత్తం కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం టీటీడీసీ భవన్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులందరూ సిద్ధంగా ఉండాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం మొక్క నాటిన వెంటనే మిషన్‌మోడ్‌లో ఒకే సారి నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో రెండు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, అటవీ భూములను పరిశీలించి నివేదికలు రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున హరితహారంలో మొక్కలను నాటాలని సూచించారు. రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారుల పక్కన మొక్కలు భవిష్యత్‌లో తొలగించకుండా మార్జిన్‌ను కేటాయించుకుని దూరంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. చెట్లు లేకపోతే వచ్చే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ తరాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేం దుకు సీనియర్ జిల్లా అధికారిని బాధ్యుడిగా నియమించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
కలెక్టర్ సమీక్ష....
తొలుత జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో సీఎం పర్యటనపై సమావేశం నిర్వహించారు. 18న జిల్లాకు సీఎం వచ్చే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు ఆయా ప్రగతి నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ దివ్య, జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, జిల్లా అటవీశాఖ అధికారి నర్సయ్య, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ భానుప్రసాద్‌లు పాల్గొన్నారు.