లీకేజీపై సీఐడీ విచారణ | CID probe begins water leak in Andhra Pradesh new Assembly building | Sakshi
Sakshi News home page

లీకేజీపై సీఐడీ విచారణ

Jun 8 2017 10:13 PM | Updated on Aug 11 2018 8:21 PM

అసెంబ్లీలో వర్షం నీరు లీకేజీపై సీఐడీ విచారణ గురువారం కొనసాగింది. సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు

సాక్షి, అమరావతి : అసెంబ్లీలో వర్షం నీరు లీకేజీపై సీఐడీ విచారణ గురువారం కొనసాగింది. సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు నేతృత్వంలో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైల బృందం ఆధారాలు సేకరిస్తోంది. అసెంబ్లీలో పనిచేసిన ఎలక్ట్రిషీయన్‌లు, టెక్నిషియన్స్‌ను సీఐడీ అధికారులు విచారించారు. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. సీఐడీ అధికారుల విచారణ సమయంలో మీడియాను అనుమతించలేదు.

అసెంబ్లీ భవనంలోని సీసీ కెమెరా పూటేజీలను సేకరించినట్టు తెల్సింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లెజిస్టేటివ్‌ పార్టీ కార్యాలయంతోపాటు మిగిలిన ఛాంబర్‌లను కూడా పరిశీలించారు. నీరు ఎక్కడి నుంచి లీకు అయ్యింది, ఎందుకు లీకైంది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్‌సీఎల్‌పీ కార్యాలయం వద్ద లీకేజీకి కారణమైన పైపును పరిశీలించిన సీఐడీ అధికారులు అందుకు బాధ్యులు ఎవరు కోణంపైనే దృష్టిపెట్టారు. దీన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిపుణులు పరిశీలించేలా చర్యలు చేపట్టారు.

ఇదే సమయంలో ఫోరెన్సికల్‌ నిపుణుల నిర్థారణపైనే ఆధారపడకుండా సివిల్‌ ఇంజినీరింగ్‌లో నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌లు (నిపుణులు)ను తీసుకొచ్చి అసెంబ్లీలో లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించే ఏర్పాట్లు చేశారు. ఒకటి రెండు రోజుల్లో నిపుణులు పరిశీలన అనంతరం సీఐడీ ఒక నిర్థారణకు రానున్నట్టు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేధిక ఇచ్చే అవకాశం ఉంది.

పైపు కట్‌ చేయడం వల్లే నీరు : సీఐడీ డీజీ ద్వారకా తిరుమలరావు
పైపు కట్‌ చేయడం వల్లే అసెంబ్లీ భవనంలో వర్షం నీరు లీకేజీకి కారణమని నిర్ధారించినట్టు సీఐడీ డీజీ ద్వారకా తిరుమల రావు సాక్షికి చెప్పారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్ ‌(రూఫ్‌) దిగువన పెట్టిన కమ్యూనికేషన్స్‌ కేబుల్స్‌ నడిపే పైపు కట్‌ చేసి ఉందని చెప్పారు. ఆ పైపు విరిగినట్టుగానీ, పగిలినట్టు గానీ లేదన్నారు. రంపం బ్లేడు, యాక్స్‌ బ్లేడ్‌తో కోసినట్టు ఉందని గుర్తించామన్నారు. కట్‌ చేసిన ఉన్న పైపును ఎంసీల్‌తో మూసివేశారన్నారు. దానికి ఎంసీల్‌ వేయకముందు పరిశీలిస్తే మరింత స్పష్టత వచ్చేందని చెప్పారు. లీకేజీకి కారణమైన పైపు ఎవరు కట్‌ చేశారు? ఎందుకు చేశారు? అనేది తమ దర్యాప్తులో తేలాల్సి ఉందని చెప్పారు. వర్షానికి ముందు అక్కడ ఎవరు పనిచేశారు. లోనికి ఎవరు వెళ్లారు అనే కోణాల్లో కూడా విచారణ నిర్వహిస్తున్నామని వివరించారు. అన్ని కోణాల్లోను నిస్పాక్షపాతంగా విచారణ పూర్తి చేసి వీలైనంత త్వరలోనే ప్రభుత్వానికి నివేధిస్తామని ఆయన తెలిపారు.

సర్కారు సంకేతాలకు అనుగుణంగానే...
అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాల్లో చోటు చేసుకున్న లోపాలే వర్షనీరు లీకేజీలకు కారణమని లోకం కోడై కూస్తోంది. అయిన్నప్పటికీ కుట్రకోణం సాకుతో అసలు విషయాన్ని మరుగునపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు రేగుతున్నాయి. సర్కారు సంకేతాలకు అనుగుణంగానే సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీఎల్‌పీ కార్యాలయం రూఫ్‌ వద్ద పైపు కట్‌ చేసి ఉందనే కారణం చూపుతున్న ప్రభుత్వం అందుకు నిర్మాణ సంస్థ వైఫల్యాన్ని గుర్తించకపోవడం గమనార్హం.

బుధవారం విచారణ ప్రారంభించిన సీఐడీ అధికారులు తొలుత వైఎస్సార్‌ఎల్‌పీ కార్యాలయ సిబ్బందిని గద్దించి భయపెట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వర్షం నీరు ఎలా వచ్చింది? నీరు లీకేజీ ఫొటోలు, వీడియోలు ఎవరు తీసారు? మీడియాకు ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. గురువారం టెక్నిషీయన్స్‌, ఎలక్రి‍్టషీయన్‌ల విచారణలోను ఇదే తీరు కొనసాగింది. ఒకరో, ఇద్దరో సిబ్బందిని బలిపశువులను చేసి చర్యలు తీసుకున్నట్టు లీకేజీ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయనే అనుమానాలు పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement