కనుల పండువగా చౌడేశ్వరీ జ్యోతి | Sakshi
Sakshi News home page

కనుల పండువగా చౌడేశ్వరీ జ్యోతి

Published Sat, Apr 15 2017 11:34 PM

కనుల పండువగా చౌడేశ్వరీ జ్యోతి - Sakshi

అమడగూరు(పుట్టపర్తి)  : చల్లని తల్లి చౌడేశ్వరమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ అనేక మంది భక్తులు శనివారం అమ్మవారిని వేడుకున్నారు. గత ఐదు రోజులుగా మండలంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ జ్యోతి ఉత్సవాన్ని కొత్తపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. జ్యోతి ఉత్సవంలో ఎప్పటిలాగానే పొట్టా పురుషోత్తమరెడ్డి రథసారథిగా అమ్మవారిని ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి దగ్గర వరకూ తీసుకెళ్లి భక్తుల సౌకర్యార్థం కొలువుదీర్చారు.

అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కొబ్బరికాయలను సమర్పించారు. ఊరేగింపులో చౌడేశ్వరీ అమ్మవారు దేదీప్యమానంగా కాంతులను విరజిమ్ముతున్నట్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులంతా జై చౌడేశ్వరీ మాతా అంటూ హోరెత్తించారు. అనంతరం కోలాటాలు, భజనలు, హరికథల వంటి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో చండీయాగం నిర్వహింపజేశారు. ఉత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శివరాముడు, ఎస్‌ఐలు చలపతి, సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అశ్వవాహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమాదేవి, జయదేవరెడ్డి, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement