అక్కడ పోలీసు హెచ్చరికలు మాత్రమే వినిపిస్తాయి...


మెదక్ : బస్టాండ్ వద్ద రహదారికి అడ్డం ఉన్న ఆటోను పక్కకు తీయండి... ఆ దుకాణం వద్ద గుంపులుగా నిలబడకండి ...అంటూ మైక్‌లో పోలీసుల హెచ్చరికలు వినిపిస్తుంటాయి. కానీ, ఆ పరిసర ప్రాంతాలలో పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించరు. మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు చేపట్టిన వినూత్నయత్నమిది.


సిబ్బంది కొరత, తీరిక లేని విధులు... ఈ రెండింటి నుంచి విముక్తి పొందేందుకు వారు ఈ విధానానని ప్రవేశపెట్టారు.  రోడ్డుపై గొడవ జరిగినా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే విధంగా వాహన పార్కింగ్ ఉన్నా.... ఎక్కడైనా జనం గుమికూడినా పోలీస్ స్టేషన్‌లో ఉండే మైక్‌ల ద్వారా వారు హెచ్చరికలు జారీ చేసి... శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.


ఈ మేరకు రామాయంపేట బస్టాండ్‌ లోపల, బయట సిద్దిపేట రోడ్డు వద్ద, అంబేద్కర్ విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద మైక్‌లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మానిటరింగ్ సిస్టం, ఇతర పరికరాలు పోలీస్ స్టేషన్‌లోని కంట్రోల్ రూంలో ఏర్పాటు చేశారు. దానికి ఆడియో సిస్టంను అనుసంధానం చేసి అందుబాటులోకి తెచ్చారు. కంట్రోల్ రూంలో ఉండే సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి, తగిన విధంగా సూచనలు, ఆదేశాలు ఇస్తుంటారు.


సంబంధిత ప్రాంతంలో ఏదైనా ఘర్షణ జరిగిన పోలీస్ స్టేషన్‌లో రికార్డు అవుతుందనే భయంతో స్థానికులు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. పట్టణంలో ఇటీవల దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోవడంతో తాము ఈ చర్యలు తీసుకున్నామని ఎస్సై నాగార్జున తెలిపారు. అలాగే సంబంధిత ప్రాంతానికి తమ సిబ్బంది వెళ్లకుండా నేరుగా పోలీస్‌స్టేషన్ నుంచే పర్యవేక్షిస్తుండటంతో పని ఒత్తిడి తగ్గిందని ఆయన చెబుతున్నారు. ఈ విధానం మంచి ఫలితాలనిచ్చిందని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top