వంద క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

వంద క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత

Published Fri, Aug 12 2016 12:35 AM

Capture hundred quintals resanbiyyam

జనగామ : జనగామ మీదుగా నిజామాబాద్‌కు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్థానిక పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. పట్టణ రెండో ఎస్సై  శ్రీనివాస్‌ పెట్రోలింగ్‌ చేస్తుండగా డీసీఎంలో తరలుతున్న పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహన డ్రైవర్‌ షేక్‌ రజాక్‌ను అదుపులోకి తీసుకుని, సివిల్‌ సప్లయ్‌ అధికారులకు సమాచారమిచ్చారు. సివిల్‌ సప్లయ్‌ విజిలెన్స్‌ సీఐ రమణారెడ్డి చేరుకుని డీసీఎం యజమాని గఫార్‌ను ఫోన్‌లో విచారించగా ఈ బియ్యం దేవరుప్పుల మండలం పెద్దమడూరుకు చెందిన డీలర్‌ బుక్క వెంకన్నకు చెందినవిగా తేలింది. దీంతో వాహనాన్ని సీజ్‌ చేసి, వ్యాపారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయనతో ఎస్సై సంతోషం రవీందర్, ఏఎస్‌ఓ రోజారాణి, డీటీ రమేష్, ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ హరిప్రసాద్‌ ఉన్నారు.
విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల ఆకస్మిక తనిఖీ
16.50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌
పెద్దమడూరు(దేవరుప్పుల) : మండలంలోని పెద్దమడూరులో రేషన్‌షాపుపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్‌ సప్లయ్‌ అధికారులు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి ఓ వాహనంలో 100 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని తరలిస్తుండగా జనగామలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులకు పట్టుకొని విచారించగా బ్లాక్‌దందా వెలుగులోకి వచ్చింది. దీంతో గురువారం సాయంత్రం పెద్దమడూరులో అధికారులు తనిఖీలు చేయగా ఓ ఇంట్లో 16.50 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్థానిక డీలరు బుక్కా వెంకన్న డంప్‌ చేసినట్లు తేలింది. ఈ విషయమై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ జనగామలో తాము పట్టుకున్న వంద క్వింటాళ్లతోపాటు ఇక్కడ దొరికిన 16.50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం డీలరు బుక్కా వెంకన్నవిగా గుర్తించామని, శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు 6ఏతోపాటు క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నట్టు వివరించారు. 
దాడుల్లో సివిల్‌ సప్లయ్‌ డీటీ గాదెం రమేష్, ఎఎస్‌ఓ రోజారాణి, హరిప్రసాద్, సురేష్, ఏఆర్‌ఐ భద్రయ్య, వీఆర్‌ఓ రెహమాన్‌ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement