డీఎస్‌ఏ విచారణకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

డీఎస్‌ఏ విచారణకు బ్రేక్‌

Published Thu, Sep 8 2016 6:05 PM

డీఎస్‌ఏ విచారణకు బ్రేక్‌

కడప స్పోర్ట్స్‌:
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో గురువారం విచారణ పర్వానికి బ్రేక్‌ పడింది. డీఎస్‌ఏలో గత నెల 5న అవుట్‌డోర్‌ క్రీడామైదానంలోని స్టోర్‌ గది తాళాలు పగులగొట్టిన సంఘటన నేపథ్యంలో శాప్‌ బోర్డు సభ్యుడు, డీఎస్‌ఏ అధికారులు ఒకరిపై ఒకరు కేసులు నమోదు వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో శాప్‌ ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర సమాచారం కోసం విచారణాధికారిని నియమించారు. దీంతో గురువారం విచారణాధికారిగా శాప్‌ నుంచి గిరిజన క్రీడాఅధికారి దేవానంద్‌ కడపకు విచ్చేశారు. ఉదయాన్నే క్రీడామైదానానికి చేరుకున్న ఆయన డీఎస్‌ఏలోని వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియం, అవుట్‌డోర్‌ స్టేడియంలను పరిశీలించారు. బాత్‌రూంలు, డార్మిటరీ గదులను పరిశీలించి సెల్‌ఫోన్‌ ద్వారా వివరాలను రికార్డు చేసుకున్నారు. అనంతరం డీఎస్‌డీఓ లక్ష్మినారాయణశర్మ, శాప్‌ డైరెక్టర్‌ జయచంద్ర, డీఎస్‌ఏ సిబ్బందితో మాట్లాడారు.
కలెక్టర్‌ సూచనతో వెనక్కి...!
డీఎస్‌ఏ ఘటనపై విచారణ చేపట్టేందుకు వచ్చిన విచారణాధికారి దేవానంద్, డీఎస్‌డీఓ ఎం.లక్ష్మినారాయణశర్మతో కలిసి జిల్లా కలెక్టర్‌ కె.వి. సత్యనారాయణను కలిశారు. డీఎస్‌ఏ ఘటనపై విచారణ చేసేందుకు శాప్‌ అధికారులు పంపారని, విచారణ చేపట్టేందుకు అనుమతించాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్‌ మాట్లాడుతూ డీఎస్‌ఏ ఘటనపై ఇప్పటికే కమిటీవేసి విచారణ పూర్తిచేశామని, మళ్లీ విచారణ అక్కరలేదని పేర్కొనడంతో విచారణాధికారి వెనుదిరిగారు. మధ్యాహ్నం డీఎస్‌ఏలో సిబ్బందితో సాధారణంగా సమావేశమై వెనుతిరిగి వెళ్లిపోయారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement