తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నెవాడు ఇంకోడు అని పాతకాలపు సామెత. నేరుగా లంచాలు తీసుకునేందుకు జంకే, భయపడే ప్రభుత్వ ఉద్యోగులు... ఆ మొత్తాలను ఇంటావిడకు ఇమ్మని.. లేదా బంధువుల చేతుల్లో పెట్టమని అడగడం.. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా విఫలమై అధికారులకు చిక్కిన వైనాల గురించి మనం తరచూ చూస్తూంటాం. ఈ వ్యవహారం కూడా అలాగే ఉంది. కాకపోతే.. ఈ సంఘటనలో లంచం తీసుకున్నది చాలా వెరైటీగా కావడం విశేషం. వివరాలు..
రాజస్థాన్‌లో రాజ్‌కాంప్ అని ఒక ప్రభుత్వ సంస్థ ఉంది. దీనికి ప్రద్యుమ్న దీక్షిత్ జాయింట్ డైరెక్టర్. ప్రభుత్వమన్నాక ఐటీలో కొన్ని పనులు చేపట్టడం.. వాటికి సంబంధించిన కాంట్రాక్టులు ప్రైవేటు వారికి ఇవ్వడం సహజమే. కానీ ఈయనగారు ఒక షరతుపై రెండు కాంట్రాక్టులను రెండు వేర్వేరు కంపెనీలకు ఇచ్చేశాడు. తన భార్యకు ఉత్తుత్తి ఉద్యోగం ఒకటి ఇవ్వడం.. నెల నెల జీతం కింద కొంత మొత్తం ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడమే ఈ షరతు. రెండు కంపెనీలు దీనికి ఒప్పుకున్నాయి. కాంట్రాక్టు దక్కించుకున్నాయి.
రెండేళ్లు గడచిపోయాయి. ప్రద్యుమ్న దీక్షిత్ భార్య పూనమ్ దీక్షిత్.. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లోనే కూర్చుని ఉంటోంది. నెల తిరక్కముందే ఆమె బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చిపడుతున్నాయి. ఏదైనా పాపం పండే వరకే అంటారు కదా.. అలాగే ఈ వ్యవహారం కూడా ఎట్టకేలకు బట్టబయలైంది. రాజస్థాన్ హైకోర్టు గత ఏడాది ఐటీ కాంట్రాక్టులు పొందిన సంస్థలపై దర్యాప్తు జరపాలని ఒక ఆదేశం జారీ చేసింది.
అటు.. ఇటు తిరిగి ఈ విచారణ కాస్తా ఈ ఏడాది జూలైలో మొదలైంది. 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబరు వరకూ పూనమ్ దీక్షిత్‌కు రెండు కంపెనీల నుంచి సుమారు రూ.38 లక్షల రూపాయల వరకూ ముట్టినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ 21 నెలల కాలంలో ఆమె ఒక్కసారి కూడా ఆయా ఆఫీసుల గడప తొక్కిన పాపాన పోకపోవడం ఇంకో విశేషం. అంతేకాదు... ఆమె నిజంగానే ఉద్యోగం చేస్తోందన్న భ్రమ కల్పించేందుకు ప్రద్యుమ్న స్వయంగా అటెండెన్స్‌కు సంబంధించిన మెయిళ్లు అప్రూవ్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది.
ఒక కంపెనీ నుంచి ఫ్రీలాన్సింగ్ పేరుతో.. ఇంకో కంపెనీ నుంచి జీతం పేరుతో ఈమె ఖాతాలోకి డబ్బులు వచ్చినట్లు స్పష్టమైంది. కంపెనీ రికార్డులు.. పూనమ్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన తరువాత రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రద్యుమ్న దీక్షిత్‌పై ఈ నెల 17న కేసు నమోదు చేశారు.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా


