breaking news
district sport authority
-
డీఎస్ఏ విచారణకు బ్రేక్
కడప స్పోర్ట్స్: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో గురువారం విచారణ పర్వానికి బ్రేక్ పడింది. డీఎస్‌ఏలో గత నెల 5న అవుట్డోర్ క్రీడామైదానంలోని స్టోర్ గది తాళాలు పగులగొట్టిన సంఘటన నేపథ్యంలో శాప్ బోర్డు సభ్యుడు, డీఎస్ఏ అధికారులు ఒకరిపై ఒకరు కేసులు నమోదు వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో శాప్ ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర సమాచారం కోసం విచారణాధికారిని నియమించారు. దీంతో గురువారం విచారణాధికారిగా శాప్ నుంచి గిరిజన క్రీడాఅధికారి దేవానంద్ కడపకు విచ్చేశారు. ఉదయాన్నే క్రీడామైదానానికి చేరుకున్న ఆయన డీఎస్‌ఏలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియంలను పరిశీలించారు. బాత్రూంలు, డార్మిటరీ గదులను పరిశీలించి సెల్‌ఫోన్ ద్వారా వివరాలను రికార్డు చేసుకున్నారు. అనంతరం డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ, శాప్ డైరెక్టర్ జయచంద్ర, డీఎస్ఏ సిబ్బందితో మాట్లాడారు. కలెక్టర్ సూచనతో వెనక్కి...! డీఎస్ఏ ఘటనపై విచారణ చేపట్టేందుకు వచ్చిన విచారణాధికారి దేవానంద్, డీఎస్డీఓ ఎం.లక్ష్మినారాయణశర్మతో కలిసి జిల్లా కలెక్టర్ కె.వి. సత్యనారాయణను కలిశారు. డీఎస్ఏ ఘటనపై విచారణ చేసేందుకు శాప్ అధికారులు పంపారని, విచారణ చేపట్టేందుకు అనుమతించాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ డీఎస్ఏ ఘటనపై ఇప్పటికే కమిటీవేసి విచారణ పూర్తిచేశామని, మళ్లీ విచారణ అక్కరలేదని పేర్కొనడంతో విచారణాధికారి వెనుదిరిగారు. మధ్యాహ్నం డీఎస్‌ఏలో సిబ్బందితో సాధారణంగా సమావేశమై వెనుతిరిగి వెళ్లిపోయారు. -
ఉత్సాహంగా క్రీడా పోటీలు
కడప స్పోర్ట్స్: క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం కడప నగరంలోని డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఈ పోటీలను డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 29న మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు వివిధ క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. «శాప్ డైరెక్టర్ జయచంద్ర మాట్లాడుతూ క్రీడాకారులు ధ్యాన్‌చంద్ చూపిన పోరాటపటిమను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు.అనంతరం పరుగుపందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వల్లూరు కేజీబీవీ వ్యాయామ ఉపాధ్యాయురాలు సునీత, కోచ్ గౌస్‌బాషా, నూర్, సిబ్బంది సూర్యనారాయణరాజు, రామకృష్ణారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.