ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
అత్తిలి : ఆలయాల నిర్మాణంలో ప్రజలు భాగస్వాములై తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు.
అత్తిలి : ఆలయాల నిర్మాణంలో ప్రజలు భాగస్వాములై తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. స్కిన్నెరపురంలో రూ. 36 లక్షల వ్యయంతో పునఃనిర్మించే కోదండ రామాలయానికి గురువారం ఎంపీ గోకరాజు గంగరాజు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి మంత్రి మాణిక్యాలరావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాలు నిర్మించడం తేలికేనని, అయితే వాటి నిర్వహణ కష్టతరంగా మారుతుందన్నారు. ప్రజలు భాగస్వాములు అయినప్పుడే ఆ ఆలయం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ గంగరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి దాత దాట్ల రామకృష్ణంరాజు రూ.12 లక్షలు విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. దాత దాట్ల రామరాజును మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ అందే సత్యం, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు, ఎంపీపీ కేతా సత్యనారాయణ, సర్పంచ్ వనుం రామకనకదుర్గ, సొసైటీ అధ్యక్షుడు వట్టికూటి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జి ఘనంగా సత్కరించారు.