కలిసొచ్చిన గురువారం!

AP Polling and Counting And Swearing Came On Thursday  - Sakshi

పోలింగ్, కౌంటింగ్, ప్రమాణ స్వీకారం అన్నీ ఒకే రోజు..

జగన్‌కు ఆ రోజు కలిసొచ్చిందంటూ ప్రజల్లో ఆసక్తికర చర్చ

టీడీపీకి 2004 కంటే సగం.. 2009 కంటే నాల్గో వంతు అంటూ సెటైర్లు

సాక్షి, అమరావతి: కొత్తగా ప్రారంభించే ఏ పనైనా ఫలప్రదం కావాలంటే వారం, వర్జ్యం చూసుకుని మొదలెట్టాలని పెద్దలు చెబుతారు. ఈ సెంటిమెంట్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అనుకోకుండా కలిసొస్తోంది. ఎలాగంటే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌లతోపాటు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. ఇలా అన్నీ యాధృచ్ఛికంగా గురువారమే వచ్చాయి. ఏప్రిల్‌ 11న పోలింగ్‌.. మే 23న ఓట్ల లెక్కింపు.. మే 30న ప్రమాణ స్వీకారం.. ఈ మూడు రోజులు గురువారమే రావడం గమనార్హం. దీంతో జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం కలిసొచ్చిందంటూ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారం, వర్జ్యం గురించి తెలిసిన వారు గురువారం గురించి గొప్పగా చెబుతున్నారు. 

అన్నీ విశేషాలే..
- ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైఎస్సార్‌సీపీ సాధించిన ఎమ్మెల్యేల స్థానాలు 151ని ఎటు నుంచి చూసినా (వెనుక నుంచి ముందుకు 151, ముందు నుంచి 151 అంకెలు వస్తాయి) ఒకేలా రావడం విశేషం. 
రాష్ట్ర చరిత్రలోనే ఒకే రాజకీయ పార్టీగా ఒంటరిగా పోటీచేసి ఏకంగా 86 శాతం (అత్యధిక) ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ సాధించడం మరో రికార్డు. 
2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 156 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరుతూ 151 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ పార్టీ.. వేరొకరిని సీఎం చేయగా సరిగ్గా పదేళ్ల తరువాత ప్రజలే 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే.. 2004 ఎన్నికల్లో వైఎస్‌ సీఎం కాగా.. చంద్రబాబుకు కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి. చిత్రం ఏమిటంటే ఈసారి జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపడుతుండగా.. చంద్రబాబు పార్టీకి 2004లో వచ్చిన దానికంటే సగమే అంటే 23 ఎమ్మెల్యేలే దక్కాయి. 
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. తాజా ఎన్నికల్లో అంతే సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీకి దక్కాయి. 
కాగా, అడ్డగోలుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు అంతేమంది ఎమ్మెల్యే, ఎంపీలనిచ్చి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని సెటైర్లు పేలుస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top