
నీరు–చెట్టు.. తమ్ముళ్లకు తాకట్టు
నీరు– చెట్టుతోపాటు పేరు మార్చిన నీరు–ప్రగతి పథకాలను తెలుగు తమ్ముళ్లు కాసులు కురిపించే కామధేనువుగా మార్చుకున్నారు.
►నీరు–ప్రగతికీ అదే దుర్గతి
►అగ్రిమెంట్ కాకపోయినా పనులు చేస్తున్న వైనం
►రూ.కోట్లు స్వాహాకు పన్నాగం
నీరు– చెట్టుతోపాటు పేరు మార్చిన నీరు–ప్రగతి పథకాలను తెలుగు తమ్ముళ్లు కాసులు కురిపించే కామధేనువుగా మార్చుకున్నారు.అధికారం అండతో అడ్డంగా నిధులు దోచుకుంటున్నారు. నీరు–ప్రగతి పథకంలో రూ.కోట్లను దండుకోవడానికి వ్యూహం పన్నారు. టెండర్ విధానానికి గండికొట్టి నామినేషన్ పద్ధతిలో పనులు చేజిక్కించుకున్నారు. అడుగడుగునా స్వాహా పర్వానికి తెరతీశారు.
పెళ్లకూరు/దొరవారిసత్రం : నీరు–చెట్టు, నీరు–ప్రగతి పనులను అధికార పార్టీ నాయకులు చేజిక్కించుకున్నారు. పనులు చేయకపోయినా చేసినట్టు రికార్డుల్లో నమోదు చేయించి నిధులు స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పెళ్లకూరు మండలంలో నీరు–ప్రగతి కింద చేపట్టే వివిధ పనులకు గత నెలలో రూ.17 కోట్లు మంజూరయ్యాయి. శ్రీకాళహస్తి ఇరిగేషన్ డివిజన్‌లో 94 పనులకు రూ.8.52 కోట్లు, నాయుడుపేట ఇరిగేషన్ డివిజన్‌లో 64 పనులకు రూ.6.48 కోట్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు మరో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. పనులు చేయకున్నా ఎం.బుక్‌లో నమోదు చేయించి నిధుల స్వాహాకు తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జన్మభూమి కమిటీలతో కలిసి..
అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు కలిసి పనులను పంచుకున్నారు. ఏదైనా పనికి సంబంధించి అంచనా విలువ రూ.10 లక్షలు దాటితే బహిరంగ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అదే జరిగితే పనులు తమకు దక్కవన్న ఉద్దేశంతో ప్రతి పనికి రూ.10 లక్షల లోపే అంచనాలు రూపొం దించారు. ఇందుకోసం అధికారులతో కుమ్మక్కయ్యారు. ప్రతి పనికి రూ.9.90 లక్షలలోపు నిధులు సరిపోతాయంటూ సరిపెట్టించారు. మండలంలోని సీనియర్ టీడీపీ నేతల్లో ఒక్కొక్కరికి రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల విలువైన పనులను కేటాయించారు. అర్ధమాల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకునికి రూ.38.19 లక్షలు, శిరసనం బేడుకు చెందిన సీనియర్ నాయకునికి రూ.78.36 లక్షల విలువైన పనులు కేటాయిం చారు. పెళ్లకూరుకు చెందిన నాయకునికి రూ.62 లక్షలు, కానూరు, రోసనూరు, పాలచ్చూరు, కప్పగుంట కండ్రిగ, కలవకూరు తదితర గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఒక్కొక్కరికి రూ.30 లక్షల విలువైన పనులు అప్పగించారు. చివరకు ఈ పనులన్నిటినీ రూ.30 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుని అదే పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకు అప్పగించారనే ప్రచారం సాగుతోంది.
అంతా డొల్ల
నీరు–ప్రగతి పథకంలో చెరువుల్లో పూడిక తొలగింపు చేపట్టి నీటినిల్వ సామర్థ్యం పెంచాలనేది లక్ష్యం. పెళ్లకూరు మండలంలో మొత్తం 67 చెరువులున్నాయి. గతంలో తొలి విడతగా 5, రెండో విడతగా 13 చెరువుల్లో నీరు–చెట్టు పథకం కింద పనులు చేపట్టారు. ఒక్కొక్క చెరువుకు రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.78 లక్షలు మంజూరయ్యాయి. కొత్తూరు, తాళ్వాయిపాడు చెరువుల్లోని మట్టిని అక్కడి టీడీపీ నాయకులు ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. రెండోవిడత నీరు–చెట్టు కింద రూ.6.78 కోట్లు మంజూరు కాగా, ఈనిధులతో శిరసనంబేడు గ్రామంలోని సెజ్ భూముల్లో రైతులకు అవసరం లేనిచోట తూతూమంత్రంగా చెరువు పనులు చేపట్టి నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పెళ్లకూరులో కోనేరు పనులు చేపట్టకుండా స్థానిక నాయకుడు రూ.2.50లక్షలు నిధులు మింగేసినట్టు విమర్శలొచ్చాయి. నీరు–ప్రగతి పనుల్లోనూ అదే దందా నడుస్తోంది. అగ్రిమెంట్లు కాకపోయినా పనులు చేపట్టి నిధులు స్వాహా చేసేందుకు చకచకా ఏర్పాట్లు సాగిపోతున్నాయి.
నాలుగు స్తంభాలాట
దొరవారిసత్రం మండలంలో నీరు–చెట్టు పనులు చేజిక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. వారంతా నాలుగు వర్గాలుగా ఏర్పడి పనులన్నిటినీ తమ వర్గానికే కేటాయించాలంటూ నియోజకవర్గ నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. తొలి, మలివిడత పనుల్లో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా పనులు చేసి రూ.లక్షలు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మూడో విడతగా చేపట్టే 67 పనులకు రూ.7.77 కోట్లు మంజూరయ్యాయి. పని విలువ రూ.10 లక్షలు దాటి ఉంటే టెండర్లు ద్వారా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉంది. అలాకాకుండా రూ.10 లక్షల లోపు అంచనాలు వేయించి పనులను చేజిక్కించుకునేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. ఏకొల్లు, పూలతోట, మీజూరు, కల్లూరు తదితర పంచాయతీల్లో ఈ పనులు దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
అగ్రిమెంట్ లేకుండానే..
ఏకొల్లు, నెల్లూరుపల్లి, కట్టూవాపల్లి తదితర ప్రాంతాల్లో నీరు–చెట్టు పథకం కింద చెరువు కట్ట మరమ్మతులు, కలుజు, తూముల నిర్మాణం వంటి పనులు నెల రోజులుగా జరుగుతున్నాయి. సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ పనులను అగ్రిమెంట్ చేయకుండానే తెలుగు తమ్ముళ్లు చేయిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రాంతాల్లో చేపట్టిన పనులు 80 శాతం పైబడి పూర్తికావచ్చాయి. నెల్లూరుపల్లి, బూదూరు. అక్కరపాక, పోలిరెడ్డిపాళెం పంచాయతీల్లో అధికార పార్టీ నాయకులే పనులు చేస్తున్నారు. నెల్లూరుపల్లి ప్రాంతంలో మూడు చెరువులకు నిధులు మంజూరు కాగా, కట్ట మరమ్మతులు పూర్తి చేసి కలుజు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.