ఏపీకి మరో 600 మెడిసిన్ సీట్లు రానున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.
గుమ్మఘట్ట : ఏపీకి మరో 600 మెడిసిన్ సీట్లు రానున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం గ్రామ సమీపాన బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెడిసిన్ సీట్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలలు, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి మరో రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఎన్‌ఆర్‌ఐలకు పోకుండా చూస్తామన్నారు. ఈ నెల 30లోగా మెడిసిన్ సీట్లు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెండు చోట్ల సీటు పొందిన వారు చివరి తేదీలోగా ఒకదాన్నే ఖరారు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో ధువీకరణ పత్రాలను వెనక్కిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.