breaking news
kaminenei srinivas
-
ఏపీకి మరో 600 మెడిసిన్ సీట్లు
గుమ్మఘట్ట : ఏపీకి మరో 600 మెడిసిన్ సీట్లు రానున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం గ్రామ సమీపాన బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెడిసిన్ సీట్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలలు, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి మరో రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎన్ఆర్ఐలకు పోకుండా చూస్తామన్నారు. ఈ నెల 30లోగా మెడిసిన్ సీట్లు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెండు చోట్ల సీటు పొందిన వారు చివరి తేదీలోగా ఒకదాన్నే ఖరారు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో ధువీకరణ పత్రాలను వెనక్కిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
హరిత అనంతే లక్ష్యం
→ నిరంతర ఉద్యమంలా మొక్కలపెంపకం → వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాయదుర్గం : ఎడారి ఛాయలు కనిపిస్తున్న జిల్లాను హరిత ‘అనంతపురం’లా మారుస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మొక్కల పెంపకం నిరంతర ఉద్యమంలా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గం మండలం కెంచానపల్లి వద్ద గల మురిడప్ప కొండలో ‘కొండ పండుగ’, కణేకల్లు మండలం రచ్చుమర్రి గ్రామంలో ‘వనం– మనం’ కింద మొక్కల పెంపకం చేపట్టారు. మంత్రి కామినేనితోపాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ ఎడారి నివారణకు పరిష్కారమార్గం మొక్కలు నాటడమేనని భావించి, నాందిపలికామన్నారు. మిషన్ హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వనం మనం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10,500 లక్షల మొక్కలు నాటి ‘హరిత అనంతపురం’గా మార్చడానికి కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిటాల సునీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిస్తే భవిష్యత్తులో అవి మనల్ని రక్షిస్తాయని తెలిపారు. కెంచానపల్లి వద్ద మురిడప్పకొండలో నాటిన మొక్కల్లో రెండింటిని తన భర్త పరిటాల రవీంద్ర పేరుతో దత్తత తీసుకుని సంరక్షిస్తానని సభాముఖంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ చమన్ సాబ్, కలెక్టర్ కోనశశిధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రానైట్ కొండలో మొక్కల పెంపకమా? రాయదుర్గం రూరల్ : కొండ పండుగ పేరిట మొక్కలు నాటిన మురిడిప్ప కొండలో 30 ఏళ్లుగా గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారు. అటువంటి ప్రదేశంలో మొక్కలు నాటడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని కొందరు అధికారులు, స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రానైట్ కోసం తవ్వకాలు జరిపినపుడు మొక్కలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. బోడి కొండలు అనేకం ఉన్నప్పటికీ మురిడప్ప కొండను ఎంపిక చేయడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.