ఆ రోడ్డు ఖర్చు భరించలేం : ఢిల్లీ ప్రభుత్వం

Express Road Construction Unbearable: Delhi Government - Sakshi

సాక్షి, ఢిల్లీ : నగరానికి తూర్పు, పశ్చిమ దిశలలో నిర్మిస్తున్న ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌ రహదారికి అయ్యే భూసేకరణ ఖర్చును భరించలేమని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఖర్చును ప్రాజెక్టు వల్ల లబ్ది పొందే ఆయా రాష్ట్రాలే భరించాలని వాదించింది. వివరాలు.. ఢిల్లీ నగరంలో ట్రాఫిక్‌ పెరుగుతున్న దృష్ట్యా సిగ్నల్‌ ఫ్రీ రోడ్లను అభివృద్ధి చేయాలని 2005లో నిర్ణయించారు. ఈ రోడ్డు నగరానికి తూర్పు దిక్కున ఉన్న నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పిరిధిలోకి వచ్చే ఘజియాబాద్‌, పరీదాబాద్‌, గౌతమ్‌ బుద్ధ నగర్‌ (గ్రేటర్‌ నోయిడా), పాల్వాల్‌ల గుండా వెళ్తుంది. పశ్చిమ దిక్కున కుండ్లి, మానేసర్‌ల గుండా వెళ్తూ పాల్వాల్‌ను కలుపుతుంది. తూర్పు దిక్కున రహదారి ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, పశ్చిమ దిక్కున రహదారి హర్యానాలో ఉంది. 2005లో ఈ ప్రాజెక్టు భూసేకరణ వ్యయాన్ని 844కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం, ఉత్తర ప్రదేశ్‌, హర్యానాలు చెరో పాతిక శాతం భరించాలని ఒప్పందం చేసుకున్నారు.

అయితే అనూహ్య జాప్యం కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవగా, ఇప్పుడు అంచనా వ్యయం 8462 కోట్లకు చేరింది. 2005 నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 700 కోట్లు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌, హర్యానాలు తమ వాటా సొమ్మును కొంచెం ఆలస్యంగా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పెరిగిన వ్యయం కారణంగా మిగిలిన రూ. 3500 కోట్లను ఢిల్లీ ప్రభుత్వం భరించాల్సిందేనని కేంద్రం గత నెలలో అపెక్స్‌ కోర్టుకు విన్నవించింది. కేంద్రంతో ఏకీభవించిన అపెక్స్‌ కోర్టు తక్షణం రూ. వెయ్యికోట్లను వాటా ప్రకారం చెల్లించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆప్‌ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ విషయంపై శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ..  వ్యయాన్ని భరించే స్థోమత ప్రభుత్వానికి లేదని, అంతేకాక ఆలస్యానికి కారణమైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలే ఈ వ్యయాన్ని భరించాలని తెలిపారు.

రహదారి వెంబడి ఆయా రాష్ట్రాలు టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపడుతున్నాయి కనుక లబ్దిపొందుతుంది వారేనంటూ ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి లబ్ది కలగడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు తమ ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజల మీద వేసిన పర్యావరణ పన్ను ద్వారా వచ్చిన డబ్బు రూ. 900 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఈ నిధులను ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రాజెక్టు నుంచి మినహాయింపును కోరుతూ నెలరోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది.  

Read latest Delhi News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top