సంక్రాంతి సంబరాల్లో విషాదం

Young Man Died in Jallikattu Competition Chittoor - Sakshi

ప్రాణం తీసిన జల్లికట్టు

ఎద్దు పొడిచి ఒకరి మృతి

ఎనిమిది మందిపై కేసు నమోదు

చిత్తూరు, రామకుప్పం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎద్దుల పోటీలు ఏర్పాటు చేశారు. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రారంభమైన కొంత సేపటికే అనుకోని ఘటనతో విషాదం ఎదురైంది. ఎద్దును నిలువరించే క్రమంలో 89–పెద్దూరుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన రామకుప్పం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.మండలంలోని పెద్దబల్దారు, చిన్నబల్దారు, కవ్వంపల్లె మధ్యలో ఉన్న భారతంమిట్టలో సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామస్తులు ఎడ్ల పందేలు ఏర్పాటు చేశారు.

గెలుపొందిన ఎద్దులకు భారీగా బహుమతులను ప్రకటించారు. దీంతో స్థానికంగా ఉన్న ఎద్దులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీగా చేరాయి. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఎడ్ల పందేలను చూడటానికి జనం తరలివచ్చారు. పరుగుపందెం ప్రారంభమైన కాసేపటికి మెరుపు వేగంతో దూసుకువచ్చిన ఓ ఎద్దు కొమ్ములతో 89–పెద్దూరుకు చెందిన అబ్దుల్‌బాషా (28)ను ఢీకొట్టింది. మెడ భాగంలో కొమ్ము దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే రక్తపుమడుగులో కుప్పకూలాడు. తీవ్రంగా గాయపడిన బాషాను స్థానికులు హుటాహుటిన పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూబాషా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

8 మందిపై కేసు నమోదు
పోలీసుల ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎడ్ల పరుగుపందెం నిర్వహించిన ఏడుగురిపై, ఎద్దు యజమానిపై కేసు నమోదు చేసినట్లు కుప్పం రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమోహన్, రామకుప్పం ఎస్‌ఐ ప్రసాద్‌రావు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా జల్లికట్టు, ఎడ్ల పరుగుపందెం నిర్వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చ రించారు. మనుషుల ప్రాణాలను ఫణంగా పెట్టి నిర్వహిస్తున్న ఈ ఆచారానికి ప్రజలు, రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని సూచించారు. 

బాధిత కుటుంబానికి ప్రభుత్వం చేయూత
అబ్దుల్‌బాషా కుటుంబాన్ని ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీ తేజ్‌ పరామర్శించారు. ఎద్దుల పోటీల్లో యువకుడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నా రు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున  ఆదుకుంటామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top