అమ్మా.. నువ్వు లేని లోకంలో ఉండలేను..

Young Man Commits Suicide In Guntur - Sakshi

సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడి ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో ఘటన

గుంటూరు , యనమదల (ప్రత్తిపాడు): ‘ఆరేళ్ల కిందట నాన్న మరణించాడు.. కష్టమంటే ఏంటో తెలీకుండా పెంచిన అమ్మ కూడా ఏడాది కిందట నన్ను విడిచి వెళ్లిపోయింది. నన్ను చూసి ఈ లోకం అనాథ అంటూ సూటిపోటి మాటలంటోంది. అమ్మా, నాన్న లేని ఈ లోకంలో నేను ఉండలేను. అమ్మా.. నేనూ నీ వద్దకే వస్తున్నా..’ అంటూ ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు నగరం కొరిటెపాడుకు చెందిన డొంకేని సాయిసందీప్‌ (23) తండ్రి శ్రీనివాసరావు ఆరేళ్ల కిందట మృతిచెందాడు. తల్లి రాధాకుమారి సంరక్షణలో సాయిసందీప్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఏడాది కిందట తల్లికూడా మృత్యువాత పడటంతో అతని జీవితం తల్లకిందులైంది. కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో మానసికంగా కుంగిపోయాడు.

ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొన్ని నెలల నుంచి అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకు ఎవరూ లేరన్న బాధను దిగమింగుకోలేక, అనాథ అన్న మాటను జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఎంతసేపటికీ సాయిసందీప్‌ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని అన్నమ్మ తలుపులు గట్టిగా తట్టి చూసింది. సందీప్‌ చీరకు వేలాడుతూ కనిపించడంతో నివ్వెరపోయిన ఆమె స్థానికులకు చెప్పి.. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ఎస్‌.రవీంద్ర అక్కడికి చేరుకున్నారు. వీఆర్వో కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా సాయిసందీప్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ స్థానికులను కలచివేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top