కూలీ పనులకు వెళుతూ కానరాని లోకాలకు..

Women Died And 15injured In Auto Accident West Godavari - Sakshi

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్‌ మహిళ మృతి..

15 మందికి గాయాలు

పశ్చిమగోదావరి, చింతలపూడి: చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాలైన నలుగురిని ఏలూరు తరలించారు. గణిజర్ల గ్రామానికి చెందిన కూలీలు పత్తి చేలో పని నిమిత్తం ట్రాలీ ఆటోలో తిమ్మిరెడ్డిపల్లి గ్రామం బయలుదేరారు. తిమ్మిరెడ్డిపల్లి గ్రామం సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ వీరి ట్రాలీని రాసుకుని వెళ్లడంతో ట్రాలీలో గణిజర్ల గ్రామానికి  చెందిన బోయ నాగమణి (26)కు మెడపై బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా ట్రాలీలో ఉన్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్రాలీలో 30 మందికి పైగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. గాయపడిన వారిలో రాయల పచోటి, కొమ్ము సునీత, కొమ్ము జ్యోతి, బొర్రా రెబ్బాకకు బలమైన గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన వారు చింతలపూడి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. సీఐ పి.రాజేష్‌  సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. గ్రామస్తులు, బాధితుల కుటుంబ సభ్యులతో ఆసుపత్రి కిక్కిరిసి పోయింది. ఆసుపత్రి కారిడార్, వార్డులు అన్నీ బాధితులు, జనంతో నిండి పోయాయి. ప్రమాదానికి ట్రాక్టర్‌ ట్రక్కుకు ఉన్న ఆయిల్‌పామ్‌ గెలులు తరలించడానికి  తయారు చేసిన ఇనుప చట్రం కారణమని బాధితులు చెప్పారు.

వైఎస్సార్‌ సీపీ నేతల పరామర్శ
ప్రమాద వార్త తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త  కోటగిరి శ్రీధర్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్‌ ఎలీజా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలి డిమాండ్‌ చేశారు.

జీవనం ఎలా..?
రెక్కాడితేకాని డొక్కాడని ఆ పేద కూలీలకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. రోడ్డు ప్రమాదం వల్ల గాయాల పాలవ్వడంతో కుటుంబాలను బతికించుకోవడమెలా అని బాధపడుతున్నారు. తగిలిన దెబ్బలతో కూలి పనులకు వెళ్లే దారిలేక జీవనం ఎలా అని మదన పడుతున్నారు. మరో పది నిమిషాల్లో గమ్య స్థానం చేరుకుంటామనగా రోడ్డు ప్రమాదం జరగడంతో వీరు ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాలని కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top