అత్తింటి వేధింపులకు వివాహిత బలి

Women  Committed Suicide - Sakshi

వాంకిడి(ఆసిఫాబాద్‌) మంచిర్యాల : అత్తింటి వేధింపులకు ఓ వివాహిత బలైంది. మండలంలోని సరాండి గ్రామానికి చెందిన దుర్గం జ్యోతి(30)బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..సరాండి గ్రామానికి చెందిన దుర్గం చంద్రశేఖర్‌తో గత 13 సంవత్సరాల క్రితం ఆసిఫాబాద్‌లోని జనకాపూర్‌కు చెందిన జ్యోతితో వివాహామైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు తిరుపతి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

ఇద్దరు సంతానం కావడంతో అప్పుడు జ్యోతి కు.ని. ఆపరేషన్‌ చేయించుకుంది. అనంతరం కుమారుడు మరణించడంతో మగ సంతానం కావాలని..ఆపరేషన్‌ అయినందున ఇక పిల్లలు కారని భర్త చంద్రశేఖర్‌తోపాటు అత్త, మామలు పోచ్చుబాయి, అన్నరావు, తోటి కోడలు దుర్గం కళావతి, ఆమె భర్త దుర్గం బండులు శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేశారు. భర్త చంద్రశేఖర్‌కు రెండో వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలనేవారు.

దీంతో గత మూడు సంవత్సరాలుగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త రెండో వివాహానికి జ్యోతి ఒప్పుకోకపోవడంతో ఆమెపై అక్రమ సంబంధం ఆరోపణలు చేశారు. గత మూడు నెలల క్రితం చంద్రశేఖర్‌ గొడ్డలితో దాడి చేశాడు. ప్రతీరోజు ఏదో వంకతో అత్తంటి వేధింపులు ఉండేవని మృతురాలి తండ్రి తాక్సాండె బలవంతరావు ఆరోపించాడు.

ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సైతం గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన జ్యోతి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జ్యోతి భర్త దుర్గం చంద్రశేఖర్, అత్త పోచ్చుబాయి, మామ దుర్గం అన్నారావు, మరిది దుర్గం బండు, మరిది భార్య దుర్గం కళావతిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై రాజు తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top