మహిళ ప్రాణాలు తీసిన ప్రసాదం

Woman Dies After Took Prasadam In Temple - Sakshi

బెంగళూరు: ఆలయం వద్ద పంచుతున్న ప్రసాదం తిన్న భక్తులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాల పాలై ఓ మహిళ మరణించగా, 9 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులతో కలిపి నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన సమయంలో జరిగింది.  మరణించిన మహిళను కవిత (28)గా పోలీసులు గుర్తించారు. గుడి ట్రస్టీతో పాటు ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు.. పట్టణంలోని 20 వార్డు శ్రీరామనగర ప్రాంతానికి చెందిన నారాయణమ్మ, ఇంటి పక్కన వున్న బంధువు రాజుతో నరసింహపేటలో వెలసిన గంగాభవాని ఆలయానికి వెళ్లారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు దర్శించుకొన్నారు.

ఆలయం బయట ఇద్దరు మహిళలు బకెట్లలో కేసరిబాత్‌ను పెట్టుకుని ప్రసాదమని పంచుతున్నారు. నారాయణమ్మ, రాజు ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు. వారు తినడంత పాటు పొరుగింటి కవిత కుటుంబానికీ ఇచ్చారు. తిన్న కొంతసేపటికే అందరికీ కడుపునొప్పి, వాంతులు రావడంతో తక్షణమే చింతామణి ప్రభుత్వ అస్పత్రికి సాగించారు. కవిత, రాజు, గంగాధర, రాధ, సుధ, చిన్నారులు జాహ్నవి, శరణి తీవ్ర అస్వస్థతగా వుండంతో డాక్టర్లు కోలారు ఆస్పత్రికి పంపించారు. కోలారు జాలప్ప అస్పత్రిలో డాక్టర్లు పరీక్షించగా కవిత అప్పటికే మరణించింది. రాజు, రాధ, జాహ్నవి, శరణి పరిస్థితి విషమంగా వుండంతో ఐసీయూలో వుంచారు. చింతామణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో నారాయణమ్మ, వెంకట రమణ చికిత్స పొందుతున్నారు. ప్రసాదం కలుషితమైందా, లేక కావాలనే విషం కలిపారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top