న్యాయం కోరుతూ కలెక్టరేట్‌ వద్ద మహిళ ధర్నా

Woman darna at the collectorate seeking justice - Sakshi

భర్తను చంపిన హంతకులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌

దళిత, బీసీ సంఘాల మద్దతు

సీఐ హామీతో ధర్నా విరమణ

ఏలూరు (వన్‌టౌన్‌) : కుటుంబ తగాదాల నేపథ్యంలో తన భర్తను చంపిన నిందితులను ఏలూరు రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేయకుండా వదిలి పెట్టారని, తగిన న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఒక మహిళ తన నాలుగేళ్ల బిడ్డతో కలిసి ధర్నా చేసింది. బాధితురాలికి మద్దతుగా దళిత, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నాయి.  ఏలూరు మండలం వెంకటాపురంలో ఇందిరా కాలనీకి చెందిన తాడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ గతేడాది ఆగస్ట్‌ 28న అనుమానాస్పదంగా మృతి చెందాడు.

 తన భర్త మృతికి తాడిశెట్టి కాటంరాజు, తాడిశెట్టి నాగేంద్రమ్మ, దుర్గారావు, ధనలక్ష్మి తదితరులు కారణమని నాడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు భార్య నందిని పేర్కొంది.. అయితే ఇంత వరకు ఆ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పడం లేదని ఆమె వాపోయింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదనిఆమె పేర్కొంది. తాను పుట్టిల్లు లింగపాలెం మండలం ఆసన్నగూడెంలో ఉండగా ఆయన చనిపోవడానికి ముందు గతేడాది ఆగస్ట్‌ 27న తనకు ఫోన్‌ చేసి  అమ్మా నాన్నలు, అన్నా వదినలు తనపై  దౌర్జన్యం చేస్తున్నారని వెంటనే ఇంటికి రావాలని చెప్పారని ఆమె రోదించింది.  

ఇంటికి వచ్చేసరికి తన భర్త చనిపోయి ఉన్నాడని, అనంతరం హడావుడిగా మృతదేహాన్ని పూడ్చిపెట్టేశారని ఆమె ఆరోపించింది. దీంతో అనుమానం వచ్చి ఏలూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారని తెలిపింది. అయితే ఏడు నెలలు గడుస్తున్నా దీనిపై ఎలాంటి సమాచారం చెప్పడం లేదని, నిందితులను అరెస్ట్‌ చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

కనీసం తన భర్త కేసును హత్య కేసుగా నమోదు చేసి పోస్టుమార్టం రిపోర్టులు ఇవ్వాలని అనేకమార్లు పోలీసులకు మొర పెట్టుకున్నా వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని నందిని వాపోయింది. నిందితులతో రూరల్‌ పోలీసులు కుమ్మక్కై కేసును నీరు గార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె కలెక్టరేట్‌ ఎదుట నినాదాలు చేసింది. బాధితురాలు నందినికి మద్దతుగా దళిత, బీసీ సంఘాలు బాసటగా నిలిచాయి.

సమాచారం తెలుసుకున్న ఏలూరు రూరల్‌ సీఐ వెంకటేశ్వరరావు కలెక్టరేట్‌కు చేరుకుని ఆమెతో మాట్లాడారు. సత్వరమే న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.దీంతో బాధితురాలు ధర్నాను విరమించారు. తనకు న్యాయం జరగకపోతే మే 16 నుంచి కలెక్టరేట్‌ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించింది. అనంతరం ప్రజా సంఘాల నాయకులతో కలిసి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.

ధర్నాలో జిల్లా బహుజన సంఘం అధ్యక్షురాలు ఘంటశాల వెంకటలక్ష్మి, దళిత నేతలు నేతల రమేష్, మేతల అజయ్‌బాబు, ఏపీ మహిళా సమైఖ్య అధ్యక్షురాలు శారద, బహుజన సమైఖ్య సంఘం అధ్యక్షురాలు బలే నాగలక్ష్మి, జిల్లా మత్య్సకారుల సంఘం నాయకులు జి.సుజాత, ఆల్‌ ఇండియా దళిత రైట్స్‌ ప్రొటెక్షన్‌ నాయకులు బి.సుదర్శన, చింతలపూడి మండలం యర్రగుంటపల్లి సర్పంచ్‌ సదరబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top