
మృతిచెందిన చిన్నారులు, సుధారాణి(ఫైల్)
దేవరపల్లి : అత్తమామలు, భర్త వేధింపుల వల్లే తన అక్క బళ్లా సుధారాణి, ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిందని మృతురాలి చెల్లెలు కనకమహాలక్ష్మి ఆరోపించారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన దొంతంశెట్టి ఉమామహేశ్వరి, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె సుధారాణిని 2012లో రాజమండ్రి మంగళవారపుపేటకు చెందిన బళ్లా రాఘవేంద్రరావుకు ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఐదేళ్ల నిహారిక, నాలుగేళ్ల ఈశ్వరమణికంఠ ఉన్నారు. ఇటీవల అత్తమామలు, భర్త వేధింపులు ఎక్కువ కావడంతో పలుమార్లు సుధారాణి యాదవోలు పుట్టింటికి వచ్చింది. పెద్దల సమక్షంలో గొడవను సర్దుబాటు చేసి మళ్లీ ఆమెను కాపురానికి పంపించినట్టు సుధారాణి బంధువు బత్తుల రామారావు, చెల్లలు కనకమహాలక్ష్మి తెలిపారు.
అత్తమామల వేధింపులతోపాటు భర్త చిత్రహింసలు పెట్టేవాడని, మద్యంతాగి వచ్చి ఇబ్బంది పెట్టేవాడని రామారావు తెలిపారు. ఈనెల 18న సుధారాణి చెల్లెలు కనకమహాలక్ష్మికి నిశ్చితార్ధం జరగడంతో సుధారాణి భర్త, ఇద్దరు పిల్లలతో వచ్చారని, అనంతరం అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయని రామారావు వెల్లడించారు. అందువల్లే ఇద్దరు పిల్లలతో సుధారాణి గోదావరిలో దూకి ఉంటుందని చెప్పారు.
యాదవోలులో విషాదఛాయలు
ఇద్దరు పిల్లలతో ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలు దేరిన సుధారాణి బస్సు ఎక్కి కొవ్వూరు గోష్పాద పుణ్యక్షేత్రం వద్ద దిగినట్టు తెలిసిందని, ఆ తర్వాత గోదావరిలో దూకినట్టు తెలియడంతో అక్కడికి వెళ్లామని రామారావు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల మృతదేహాలు లభించాయని, సుధారాణి మృతదేహం లభించలేదని వివరించారు. సుధారాణి తల్లిదండ్రులు నాలుగు నెలల నుంచి జీలుగుమిల్లికి తాపీ పని నిమిత్తం వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సుధారాణి పిల్లల మరణంతో యాదవోలులో విషాదఛాయలు అలుముకున్నాయి.