బేగంపేటలో వింగర్‌ బీభత్సం 

Winger sensation in Begumpet - Sakshi

హోంగార్డు మృతి.. పలువురికి గాయాలు  

డ్రైవర్‌కు మూర్ఛరావడంతోనే ప్రమాదం 

హైదరాబాద్‌: బేగంపేటలో ఆదివారం ఉదయం టాటా వింగర్‌ వాహనం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లి వాహనాలు, పాదచారుల పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా పలు వురికి గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి వింగర్‌ ఆగిపోయింది. వింగర్‌ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మల్కాజిగిరి పరిధిలోని ప్రశాంత్‌ నగర్‌ రైల్వే క్వార్టర్స్‌ ప్రాంతానికి చెందిన సముద్రాల రవికృష్ణ (30) టాటా వింగర్‌ వాహనం డ్రైవర్‌.

తన వాహనంలో ప్రతిరోజూ ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్, బేగంపేట మీదుగా హైటెక్‌ సిటీకి హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులను తీసుకెళ్తుంటాడు. రోజూలాగానే ఆదివారం ఉదయం 10.30 సమయంలో ఉద్యోగులను తీసుకుని వెళ్తున్నాడు. బేగం పేట ప్రకాశ్‌నగర్‌ బస్టాప్‌ వద్దకు రాగానే వాహన వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ముందున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. దీంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు సమీపంలోని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి వింగర్‌ నిలిచింది.  

హోంగార్డు అక్కడికక్కడే మృతి... 
ఈ ప్రమాదంలో ప్రకాశ్‌నగర్‌ బస్టాప్‌ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు ప్రభాకర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. వింగర్‌ 8 వాహనాలను ఢీకొట్టగా అవి దెబ్బతినడంతో పాటు నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వింగర్‌ నడుపుతున్న రవికృష్ణకు ఆ సమయంలో మూర్ఛ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదంలో చనిపోయిన ప్రభాకర్‌ స్వస్థలం మెదక్‌ జిల్లా ఝరాసంగం కక్కెరవాడ. మూడేళ్ల నుంచి బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఆదివారం కావడంతో రద్దీ పెద్దగా లేదని, పని దినాల్లో ఈ ప్రమాదం జరిగితే నష్టం ఊహించని విధంగా ఉండేది. రవికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top