దొంగ మొగుడు

Two People Arrested At Hyderabad For Robbery - Sakshi

సొంతింటికే కన్నం వేసిన ఓ రౌడీషీటర్‌

డ్రైవర్‌తో కలిసి బంగారం, నగదు చోరీ

మకాం సిటీకి మార్చేందుకు భార్యను ఒప్పించాలని యత్నం

కేసు వివరాలు వెల్లడించిన ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: హైదరాబాద్‌కు మకాం మార్చాలని ఏకంగా తన సొంత ఇంట్లోనే దొంగతనం నాటకం ఆడి చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడో ఘరానా నేరగాడు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం స్థానిక ఠాణాలో కేసు వివరాలను ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడించారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధి బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌ గ్రామంలో వెలుపు ఈడ్విన్‌ మోజెస్‌ తన భార్య రాణి, ఇద్దరు పిల్లలతో కలసి నివాసముంటున్నాడు. మోజెస్‌ రౌడీషీటర్‌. అతనిపై పలు ఠాణాల్లో హత్యలు, బెదిరింపులు, ఇతర కేసులు నమోదయ్యాయి. నాదర్‌గుల్‌లో నివాసం ఉండటంతో తనకు హాని ఉందని, ఇక్కడి నుంచి మకాం హైదరాబాద్‌కు మార్చుదామని పలు మార్లు భార్య రాణికి చెప్పినా ఆమె వినిపించు కోలేదు.

ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఎలాగైనా తన భార్యను భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయాలని మోజెస్‌ పథకం పన్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5న బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో భార్యాపిల్లలను ఆటోలో ఎక్కించి మిథానికి పంపించాడు. అనంతరం మోజెస్‌ తన కారు డ్రైవర్‌ బోడ నవీన్‌ను పిలిపించుకున్నాడు. ఇంటి వెనుకవైపు నుంచి లోపలికి వెళ్లారు. బీరువా తాళాలు పగులగొట్టి పది తులాల బంగారు నగలు తీసి ఇంట్లోనే దుస్తుల బ్యాగులో తన భార్య రాణికి తెలియకుండా దాచిపెట్టాడు. రూ.2.88 లక్షలను నవీన్‌కు ఇచ్చి తన ఇంట్లో దాచుకోమని చెప్పాడు. ఇంటి ముందు భాగంలో ఉన్న ద్వారం తలుపులు లోపలి నుంచి పెట్టి వెనుక వైపు నుంచి బయటకు వచ్చారు.

తర్వాత మోజెస్‌.. నవీన్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లాడు. ఫంక్షన్‌ పూర్తయిన తర్వాత భార్యాపిల్లలను ఆటోలో తిరిగి ఇంటికి పంపించి తర్వాత అతడు వచ్చాడు. రాణి ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ వేసి ఉం ది. వెనుకభాగం నుంచి లోపలికి వెళ్లి చూసి చోరీ జరిగిందని గుర్తించింది. మోజెస్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. భర్త సూచన మేరకు రాణి ఆదిభట్ల ఠాణాలో అదేరోజు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. స్థానికులతో ఆరా తీసి సాంకేతిక ఆధారాల ద్వారా చోరీ కేసులో మోజెస్‌ సూత్రధారి అని గుర్తించారు.

సోమవారం స్థానిక ఎంవీఎస్‌ఆర్‌ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మోజెస్‌ బైకుపై వెళ్తుండగా పట్టుకున్నారు. అందులోంచి 2 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా చోరీ నేరం అంగీకరించాడు. 10 తులాల బంగా రం, రూ.2.88 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మోజెస్‌తోపాటు నవీన్‌పై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిం దితులను 24 గంటల్లో పట్టుకున్న ఆదిబట్ల సీఐ నరేందర్‌ను ఈ సందర్భంగా డీసీపీ అభినందిం చారు. ఎస్‌ఐ సురేష్‌బాబు, క్రైం పోలీసులకు నగదు రివార్డు అందజేశారు.

పట్టుబడిన ఆభరణాలతో నిందితులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top