మారు తండ్రికి రెండు యావజ్జీవ శిక్షలు

Two life imprisonment to the Step Father for Molestation - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏడాదిన్నర పాపపై లైంగికదాడికి పాల్పడి హతమార్చిన మారు తండ్రికి రెండు యావజ్జీవ శిక్షలు విధిస్తూ తమిళ నాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా మహిళా స్పీడ్‌ట్రాక్‌ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కృష్ణగిరి జిల్లా దేవర్‌ఉళిమంగళంకు చెందిన చెన్నాచారి (29), శ్వేత (23) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అశ్వని అనే ఒకటిన్నరేళ్ల పాప ఉండగా మనస్పర్థలతో విడిపోయారు. ఆ తరువాత ఉదయకుమార్‌(25) అనే ఆటో డ్రైవర్‌ను శ్వేత పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. 2016 ఆగస్టు 23న తన సమీప బంధువును పరామర్శించేందుకు శ్వేత ఆసుపత్రికి వెళుతూ అశ్వనిని ఉదయకుమార్‌కు అప్పగించింది.

అశ్వని తన చేతుల్లో నుంచి జారి కిందపడి తీవ్రగాయాలకు గురైందని భార్యకు ఫోన్‌చేసి చెప్పడంతో హుటాహుటిన వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే చికిత్స ఫలించక చిన్నారి కన్నుమూసింది. పోస్టుమార్టంలో చిన్నారిపై లైంగికదాడి జరిగి, ప్రాణాలు కోల్పోయిందని తేలింది. దీంతో పోలీసులకు లొంగిపోయిన ఉదయకుమార్‌ అశ్వనిపై లైంగికదాడికి పాల్పడి, కర్రతో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఈ కేసు విచారణ పూర్తికాగా, నిందితునికి రెండు యావజ్జీవ శిక్షలు, రూ.25 వేల జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top