
అన్నాడీఎంకే రెండాకుల గుర్తుకోసం అక్రమమార్గాన్ని ఎంచుకున్నటీటీవీ దినకరన్ సాక్ష్యాధారాలతో సహా దొరికేశారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపేందుకు హవాలా బ్రోకర్‌తో దినకరన్ జరిపిన సంభాషణలపై స్వర పరీక్షలు చేసి ఆ గొంతు టీటీవీ దినకరన్‌దేనని ఢిల్లీ పోలీసులు తేల్చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: రెండాకుల గుర్తుకోసం లంచం కేసులో టీటీవీ దినకరన్‌పై పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. హవాలా బ్రోకర్‌తో సంభాషణ దినకరన్ స్వరమే అని నిర్ధారించారు.
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే వర్గాలుగా చీలిపోయిన తరుణంలో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో చీలిక వర్గాలన్నీ పోటీకి దిగి రెండాకుల గుర్తు తమదంటే తమదని వాదించుకున్నాయి. దీంతో అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం ఎవరికీ దక్కకుండా ఎన్నికల కమిషన్ వాటిపై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో తలా ఒక పార్టీని పెట్టుకుని, స్వతంత్ర అభ్యర్థులుగా తలా ఒక చిహ్నాన్ని పొందారు. అయితే రెండాకుల గుర్తు లేకుండా ప్రజలను ఆకర్షించడం అసాధ్యమనే సత్యాన్ని చీలికవర్గ నేతలంతా తెలుసుకున్నారు. పార్టీ సభ్యుల సంతకాల సేకరణతో సంఖ్యా బలం నిరూపించుకోవడం ద్వారా రెండాకుల చిహ్నం కోసం పోటీపడడం ప్రారంభించారు. అయితే, రూ.50 కోట్ల లంచం ఇచ్చి ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను లోబరుచుకోవడం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన హవాలా బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ సహాయాన్ని ఆశ్రయించారు. ఈ లావాదేవీలు జరుగుతున్న తరుణంలో బ్రోకర్ సుఖేష్ ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిచ్చిన వాంగ్మూలంతో దినకరన్‌ను సైతం అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న దినకరన్ బెయిల్‌పై బయటకు వచ్చారు.
సాక్ష్యాధారాల సేకరణ
బ్రోకర్ సుఖేష్‌కు తనకు సంబంధం లేదని దినకరన్ బుకాయించడంతో పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను సేకరించేపనిలో పడ్డారు. ఒక టీవీ చానల్‌కు దినకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను సంపాదించి దినకరన్ గొంతును నిర్ధారించుకున్నారు. ముడుపుల వ్యవహరంలో హవాలా బ్రోకర్ సుకేష్, దినకరన్ మధ్య సాగిన సెల్‌ఫోన్ సంభాషణలను పోల్చిచూస్తూ జరిపిన స్వరపరీక్షలో ఈ గొంతు దినకరన్‌దేనని నిర్ధారణ అయినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం ప్రకటించారు.
తీవ్రంగా పరిగణించి..
దినకరన్ ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ కేసులో ఆయన ప్రమేయం రుజువుకావడంతో ఆయనను మళ్లీ అరెస్ట్‌చేసి చార్జిషీటు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.