ట్రూకాలర్‌లో డీజీపీ అని పెట్టుకొని..

Truecaller Cheater Arrested By Kushaiguda Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ట్రూకాలర్‌ ఈ స్మార్ట్‌ యాప్‌ గురించి తెలియని వారుండరు. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్‌ వస్తే వారి పేరును తెలుసుకునేందుకు సహాయ పడుతుంది. ఈ యాప్‌ వాడే వ్యక్తులు తమ పేరును రిజిస్టర్‌ చేసుకుంటారు. అందరూ వాళ్ల అసులు పేరు లేకపోతే ముద్దుపేరు పెట్టుకుంటారు. కానీ తెలివిమీరిన ఓ వ్యక్తి పెట్టుకున్న పేరు, అతడు చేసిన మోసాలు కటకటాలపాలు చేసేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే..  చర్లపల్లి పారిశ్రామికవాడ, ఫేజ్‌–5లో బిట్ల వెంకటేశ్వరరావు అనే పారిశ్రామికవేత్తకు ఉజ్వల ఇండస్ట్రీస్‌ పేరిట పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను 2017 డిసెంబరులో సికింద్రాబాద్‌కు చెందిన ఆర్‌ఈ కేబుల్స్‌ ప్రతినిధి హితేష్‌ జైన్‌ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. కాగా కంపెనీ వ్యవహరాలన్నీ హితేష్‌ జైన్‌ తమ్ముడు జతిన్‌ జైన్‌ చూసుకునేవాడు. 

ఈ క్రమంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పరిశ్రమ యజమాని వెంకటేశ్వరరావు జతిన్‌జైన్‌ను నిలదీశాడు. దీనిపై వివాదం ఏర్పడగా వెంకటేశ్వరరావు చర్లపల్లి అసోసియేషన్‌ ప్రతినిధులను ఆశ్రయించాడు. అసోసియేషన్‌ ప్రతినిధులు జతిన్‌ జైన్‌కు ఫోన్‌ చేశారు. వారికి కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నేనెవరో మీకు తెలుస్తుంది...ఒక్కసారి ట్రూ కాలర్‌ చెక్‌ చేసుకోండి అంటూ బెదిరింపు లకు పాల్పడుతూ ఫోన్‌ కట్‌ చేశాడు. తరువాత ట్రూకాలర్‌లో చూడగా డీజీపీ–టీఎస్‌ అని రావడంతో అసోసియేషన్‌ ప్రతినిధులు బాధితునితో కలిసి మంగళవారం డీజీపీని కలిశారు. వెంటనే స్పందించిన డీజీపీ, సీపీతో మాట్లాడారు. రంగంలోకి దిగిన కుషాయిగూడ పోలీసులు జతిన్‌జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top