అర్ధరాత్రి ఆర్తనాదాలు | Travel Bus Accident in East Godavari | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఆర్తనాదాలు

Dec 13 2018 12:58 PM | Updated on Dec 13 2018 12:58 PM

Travel Bus Accident in East Godavari - Sakshi

ప్రమాదంలో మృతి చెందిన అయిశెట్టి సూర్యావతి కుటుంబ సభ్యుల రోదన నుజ్జునుజ్జయిన టూరిస్ట్‌ బస్సు

వారందరూ ఈ నెల రెండో తేదీన టూరిస్ట్‌ బస్సులో తీర్థయాత్రలకు బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లో తీర్థయాత్రలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే పదిరోజుల పాటు తీర్థయాత్రల్లో ఉన్న వారందరూ మరో రెండు రోజుల్లో యాత్ర ముగించుకుని ఇంటికి చేరాల్సి ఉంది.చివరిగా తిరుగు ప్రయాణంలో తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వారందరూ బస్సులో బయల్దేరారు.
సమయం బుధవారం తెల్లవారు జామున 1.45 గంటలు..బస్సు తమిళనాడులోని వెల్లూరు కుత్‌కుడి జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ.. అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకు పోయింది. ఒక్కసారిగా పెద్దగా శబ్ధం రావడం.. ఏం జరిగిందో తెలుసుకునే లోపు బస్సులో ఉన్న వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. చిమ్మ చీకట్లో తాము ఎక్కడున్నామో కూడా తెలియని స్థితిలో ఆర్తనాదాలు చేస్తూ 40 మంది భక్తులు సుమారు రెండు గంటల పాటు నరకం చూశారు. ఈ ప్రమాదంలో ఓ భక్తురాలు తన ప్రాణాలు కోల్పోయింది.

తూర్పుగోదావరి పిఠాపురం: శబరిమలై యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర బస్సు తమిళనాడు రాష్ట్రం విరలిమలై పోలీసు స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారిపై బుధవారం
తెల్లవారు జామున ప్రమాదవశాత్తూ తిరగబడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప, కొత్తపల్లికి చెందిన 40 మంది అయ్యప్ప భక్తులు ఈనెల రెండో తేదీన ఒక టూరిస్టు బస్‌లో శబరిమలై యాత్రకు బయల్దేరి వెళ్లారు. శబరిమలై అయ్యప్ప దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని రాత్రి 12 గంటల సమయంలో తిరుపతికి బస్సులో పయనమయ్యారు. బస్సు తమిళనాడులోని వెల్లూరు కుత్‌కుడి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి అక్కడి విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టి తిరగబడింది. దీంతో బస్సు నుజ్జునుజ్జయ్యి అందులో ఉన్న ప్రయాణికులందరికీ గాయాలయ్యాయి. వారిలో ఓ భక్తురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

కన్న కొడుకును ముందే పంపించి..
‘‘పది రోజులు దాటాయి. ఇంకా యాత్రలో ఉంటే ఇంటి దగ్గర పనులు ఆగిపోతాయి. మిగిలిన స్వాములతో నేను యాత్ర పూర్తి చేసుకుని వస్తాను’’ అంటూ తనను యాత్ర ముగియక ముందే ఇంటికి పంపిన తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని మృతురాలి సూర్యావతి కొడుకు లక్ష్మీశ్రీకాంత్‌ కన్నీరుమున్నీరవుతున్నాడు. తొలిసారిగా తాను యాత్రకు వస్తానని పుణ్య క్షేత్రాలు చూసి రావాలని ఉందని పట్టుబట్టి మరీ యాత్రకు వచ్చిన తన తల్లి ఇలా మధ్యలోనే ప్రాణాలు కోల్పోతుందని ఊహించలేదంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు.

బయల్దేరిన రెండు గంటలకే ప్రమాదం
బస్సు మధురై నుంచి బయల్దేరిన రెండు గంటలకే ప్రమాదానికి గురైంది. డ్రైవరు మద్యం మత్తులో ఉండడంతో పాటు నిద్రలోకి జారుకోవడంతో వేగంగా వెళుతున్న బస్సు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాలను ఢీకొడుతూ కాలువలోకి దూసుకుపోయి తిరగబడినట్టు పోలీసులు గుర్తించారు. మధురైలో అమ్మవారి దర్శనానికి వెళ్లిన స్వాములు ఆలస్యంగా రాత్రి 12 గంటల వరకు రాక పోవడంతో డ్రైవరు ఇతర డ్రైవర్లతో కలిసి మద్యం సేవించినట్టు క్షతగాత్రులు చెబుతున్నారు.  

రెండు గ్రామాల్లో విషాదం
ఏటా మాదిరిగానే తీర్థ యాత్రను పూర్తి చేసుకుని దైవ ప్రసాదాలతో తిరిగి వస్తామని చెప్పి వెళ్లిన తమ కుటుంబీకులు క్షతగాత్రులుగా వస్తున్నారని తెలియడంతో కొత్తపల్లి, వాకతిప్ప గ్రామాల్లో బుదవారం విషాద చాయలు అలముకున్నాయి. క్షతగాత్రుల పరిస్థితి తెలియకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సెల్‌ఫోన్ల ద్వారా వారి పరిస్థితిని తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాద విషయం బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకే తెలిసినా ఎవరి పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఉదయం వరకు తెలియకపోవడంతో క్షతగాత్రుల బంధువులు తీవ్ర ఆందోళన చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement