ఛత్తీస్‌గఢ్‌ టు చంద్రాపూర్‌

Tiger Skin Seized Poachers In Karimnagar - Sakshi

పులి చర్మాల అక్రమ     రవాణాను ఛేదించిన పోలీసులు

రెండు చిరుత చర్మాలు పట్టివేత

ఆరుగురి అరెస్టు

జ్యోతినగర్‌(రామగుండం): మంచిర్యాల జిల్లాలో ఓ పులి వేటగాళ్ల ఉచ్చుతో విలవిలాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం పులుల చర్మాలు విక్రయిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. గోదావరిఖని ప్రాంతంలో అనుమానాస్పందంగా సంచరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం తాట్లంక గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్లపల్లి గ్రామానికి చెందిన మడకం చంద్రయ్య, కూనవరం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కోసవరం గ్రామానికి చెందిన సోడీ భీమయ్య, చింతూరు మండలం చిరుమూరుకు చెందిన సోయం రామారావు, సల్వం రాము, కొత్తగూడెం జిల్లా పాల్వంచ మం డలం పాలకాయ తండాకు చెందిన చిందం జంపయ్య, కొత్తగూడెం మేదరి బస్తీకి చెందిన కొంటు రఘుకుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా వారి వద్ద ఉన్న రెండు సంచుల్లో చిరుత పులుల చర్మాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.50 లక్షలకు పులుల చర్మాలు విక్రయించేందుకు వెళ్తున్నట్లు తేలింది. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామగుండం సీపీ విక్రమ్‌జీత్‌ దుగ్గల్‌ తెలిపారు.
 
వరుస ఘటనలపై అనుమానాలు..
రామగుండంప్రాంతంలోని ప్రజలు పులుల సంచారంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనికి తోడు చిరుత పులుల చర్మాలను విక్రయించే ముఠాను పోలీసులు పట్టుకోవడంతో పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఒకవైపు అటవీశాఖ అధికారులు ఆయుధాలతో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పులుల జాడ కోసమే ప్రత్యేక బృందాలు తిరుగుతున్న క్రమంలో పులి చర్మాలను విక్రయిం చే ముఠా గోదావరిఖని బస్‌స్టేషన్‌లో పట్టుబడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

రూ.5 లక్షల నుంచి 50 లక్షలు.. 
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు పులుల చర్మాలు అక్రమ రవాణా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన నలుగురుతో పాటు కొత్తగూడెం, చం ద్రాపూర్‌కు చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొం తకాలంగా పులి చర్మాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు అటవీ ప్రాంతాలకు వెళ్లి అక్కడ కొందరు వేటాడిన క్రూరమృగాల చర్మాలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.  ఒక్కో పులి చర్మానికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా ధర పలుకుతోంది. ఇదే క్రమంలో ఇటీవల గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన ఓ కార్మికుడి నుంచి కూడా ఓ పులి చర్మాన్ని  పోలీసులు సేకరించారు.
 
అక్రమ చర్మాల పయనం ఎటువైపు..  
అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన చిరుత చర్మాలను వివిధ ప్రాంతాలకు తరలించే ముఠా ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారో అనే విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదని తెలుస్తోంది. ముఠా సభ్యులు విచారణ సమయం లో పోలీసులకు సహకరించకపోవడం మరింత ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top