
పాట్నా: బిహార్‌లో అమానుష ఘటన జరిగింది. మంత్రగత్తెలన్న అనుమానంతో ముగ్గురు మహిళలను చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముజఫర్‌పూర్‌లోని డక్రామా గ్రామంలో ముగ్గురు మహిళలను గ్రామస్తులు మంత్రగత్తెలుగా భావించారు. వారివల్ల తమకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన గ్రామ ప్రజలు అంతా ఏకమై వారిపై దాడికి దిగారు. మహిళల గుండు గీయించి, అర్ధనగ్నంగా ఊరేగిస్తూ పైశాచికత్వం ప్రదర్శించారు. అంతేకాక వారిచేత మూత్రం తాగిస్తూ నీచానికి ఒడిగట్టారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (అశ్లీల ఫొటోలు షేర్ చేసి.. ఆపై..)