
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి నుంచి వస్తున్న కారు హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలి దాటిన తర్వాత కోడూరుపాడు సమీపంలోని సర్కార్ జూట్ మిల్ వద్ద అదుపు తప్పి హైవే డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డులో వస్తున్న లారీని ఢీకొట్టింది.
కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాలు.. రాజమహేంద్రవరం నుంచి ఇన్నోవా కారులో గురువారం రాత్రి డ్రైవర్ బుద్ధి వెంకటేశ్వరరావు అలియాస్ శ్రీను అతడి స్నేహితుడు బొడ్డు రాంబాబుతో కలసి విజయవాడ బయలుదేరాడు. విజయవాడ వెళ్లేందుకు రావులపాలెం బస్టాండ్ వద్ద ఎదురుచూస్తున్న ప్రయాణికులు గుంతక్ సంఘమేశ్వర్, శ్రీనివాసరావు, రమణారావు, జాషువను కారు ఎక్కించుకున్నారు. వాహనం హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలి దాటిన తరువాత కోడూరుపాడు సమీపంలోని సర్కార్ జూట్ మిల్స్ వద్ద అదుపు తప్పి హైవే డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డులో వస్తున్న లారీని ఢీకొట్టింది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.
ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న డ్రైవర్ బుద్ధి వెంకటేశ్వరరావు (25), తూర్పుగోదావరి జిల్లా రాయవరానికి చెందిన అతడి స్నేహితుడు బొడ్డు రాంబాబు(22), కారులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం బాన్సువాడకు చెందిన గుంతక్ సంఘమేశ్వర్ (23) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. విజయవాడ కోమలవిలాస్ సెంటర్‌కు చెందిన శ్రీనివాసరావు, రావులపాలేనికి చెందిన రమణారావు, గుంటూరు ఏటీ అగ్రహారంకు చెందిన జాషువా ఐన్‌స్టీన్ గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న హనుమాన్‌జంక్షన్ సీఐ ఎన్.రాజశేఖర్, వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
నిద్ర మత్తులో ప్రమాదం..
నిద్ర మత్తులో మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా వాహానాన్ని నడపటం వలనే రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి ఇన్నోవా కారును విజయవాడలో అప్పగించేందుకు బయలు దేరిన డ్రైవర్ వెంకటేశ్వరరావు తోడుగా స్నేహితుడు రాంబాబును వెంట పెట్టుకుని బయలు దేరాడు. కారు ఖాళీగా ఉండటంతో డబ్బులు వస్తాయనే ఆశతో మార్గమధ్యంలో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. డ్రైవర్ వెంకటేశ్వరరావు నిర్లక్ష్యం తన పాటు మరో ఇద్దరు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనపై వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు కేసు నమోదు చేశారు.