వృద్ధ దంపతుల హత్యకు కుట్ర

Thieves Planned To Murder Old Couple For Gold In Badvel - Sakshi

సాక్షి,బద్వేల్‌(కడప) : పట్టణంలోని నెల్లూరు రోడ్డులో నివసించే వృద్ధ దంపతులను హత్యచేసి వారి వద్ద నుంచి బంగారు నగలు దోచుకోవాలనుకున్న కొంత మంది యువకుల కుట్రను బద్వేలు అర్బన్‌ పోలీసులు, కడప సీసీఎస్‌ పోలీసులు భగ్నం చేశారు. హత్యకు రెక్కీ నిర్వహించి వెళుతున్న సమయంలో పో లీసులను చూసి పారిపోతుండగా 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం,  మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య కుట్రతో సంబంధం ఉన్న మరొక యువకుడు పరారయ్యాడు.

బుధవారం స్థానిక అర్బన్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ బి.ఆర్‌.శ్రీనివాసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని నెల్లూరురోడ్డులో చిన్నివెంకటసుబ్బయ్య తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఈయన ఇంటిలోనే బంగారు దుకాణం నిర్వహిస్తుంటాడు. ఇదే సమయంలో పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మోటు సుభాష్‌ అనే యువకుడు సిద్దవటం రోడ్డులోని ఓ బంగారు దుకాణంలో పనిచేస్తూ అప్పుడప్పుడు వెంకటసుబ్బయ్య ఇంటికి వచ్చి వెళుతుండేవాడు.

ఈ క్రమంలో వృద్ధులైన వెంకటసుబ్బయ్య, అతని భార్యను హతమార్చి బంగారు, డబ్బును దోచుకోవాలనే ఉద్దేశంతో సుభాష్‌ కడపలోని రామాంజనేయపురంలో నివసిస్తున్న తన సమీప బంధువైన మోటు వెంకటసుబ్బయ్యకు విషయం తెలిపాడు. అప్పటికే నేరచరిత్ర ఉన్న వెంకటసుబ్బయ్య కడపలోని రామాంజనేయపురంలో తనకు పరిచయమున్న పాత నేరస్తులైన వల్లెపు శశికుమార్‌ అలియాస్‌ నాని, కొమ్మరి ధనుష్‌రెడ్డి అలియాస్‌ ధనుష్, పోతురాజు చందులతో పాటు కమలాపురానికి చెందిన వెంకటరమణతో చర్చించి హత్యకు ప్రణాళికను రూపొందించారు. 

వారం రోజులుగా రెక్కీ 
వృద్ధ దంపతులను హతమార్చి బంగారు, నగదు దోచుకోవాలన్న ఉద్దేశంతో నిందితులు ఆరుగురు కలిసి వారం రోజుల కిందట నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఇందులో బంగారు వ్యాపారి వెంకటసుబ్బయ్య ఇంటికి నమ్మకంగా తరచూ వెళుతుండే సుభాష్‌ ఇంట్లోకి వెళ్లగానే మిగిలిన ఐదుగురు నిందితులు కూడా ఇంటిలోకి వెళ్లి వృద్ధ దంపతులను చంపి డబ్బు, బంగారు దోచుకువెళ్లాలని పక్కా ప్లాన్‌ వేశారు. 

హత్యకుట్రను భగ్నం చేసిన పోలీసులు
నిందితులు ఆరుగురు హత్యకు రెక్కీ నిర్వహించి సిద్దవటంరోడ్డులో వెళుతుండగా సమీపంలోని ఎరుకలబావి వద్ద అర్బన్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అప్పటికే మారణాయుధాలు దగ్గర ఉంచుకుని ఉన్న నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించగా కమలాపురానికి చెందిన వెంకటరమణ మినహా మిగిలిన ఐదురుగు పోలీసులకు చిక్కారు. అదుపులోకి తీసుకుని విచారించగా వృద్ధ దంపతుల హత్యకు కుట్ర పన్నినట్లు వివరించారు.

వారి వద్ద నుంచి రెండు పిడిబాకులు, రెండు ఇనుపరాడ్లు, ఒక ఇనుప ఎక్సలేటర్‌ వైరుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వృద్ధ దంపతుల హత్య కుట్రను భగ్నం చేయడంలో కీలకంగా వ్యవహరించిన అర్బన్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు, సీసీఎస్‌ ఎస్‌ఐ జీవన్‌రెడ్డి, ఏఎస్‌ఐ సుధాకర్, కానిస్టేబుళ్లు పుష్పరాజ్, రఫి, శ్రీనులను మైదుకూరు డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో రూరల్‌ సీఐ బొజ్జప్ప పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top