4 కేజీల బంగారు ఆభరణాల చోరీ

Thieves Broke Into A Jewellery Shop In Nandyal - Sakshi

సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. వన్‌టౌన్‌ పరిధిలోని నిమిషాంబ బంగారు దుకాణంలో నాలుగు కేజీల బంగారం. రూ.5లక్షల నగదు ఎత్తికెళ్లారు. వన్‌టౌన్‌ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన చిత్తారి వెంకన్నవర్మ చాలాకాలంగా బంగారు అంగళ్ల వీధిలో దుకాణాన్ని నడుపుతున్నాడు. షాపు వెనుక భాగంలో గోడతో పాటు ఇనుముతో తయారు చేసి తలుపు ఉంది. పాత భవనం కావటంతో షాపు పైభాగంలో గవాజీ ఉండేది. యజమాని వెంకన్నవర్మ ఎప్పటిలాగే బుధవారం రాత్రి 10 గంటలకు దుకాణం మూసి ఇంటికి వెళ్లి పోయాడు. రాత్రి 12 నుంచి 2 వరకూ పట్టణంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షం నిలిచిపోయిన కొద్ది సేపటికి ఆప్రాంతంలో పోలీసు పహారా లేకపోవటం దొంగలకు అదనుగా మారింది. పక్కనే మెట్ల ద్వారా దొంగలు షాపు పైఅంతస్తుకు ప్రవేశించారు. పైభాగంలో వెంటిలేషన్‌ కోసం ఉంచిన గవాజీ నుంచి దొంగలు దర్జాగా దుకాణంలోకి ప్రవేశించారు.

దుకాణంలో ఉన్న బంగారు అభరణాలతో పాటు గల్లా పెట్టెలో దాచిన రూ.5 లక్షల నగదును దోచుకున్నారు. అనంతరం దుకాణం వెనక భాగంలో ఉన్న ఇనుప వాకిలి వద్దకు చేరి దానికున్న తాళం నెమ్మదిగా తొలగించి అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం 11 గంటలకు వెంకన్నవర్మ దుకాణాన్ని తెరిచాడు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నా దుకాణంలోని బంగారు మాత్రం మాయమైంది. ఇది చూసి యజమాని కంగుతిన్నాడు. తాను దాచుకున్న రూ.5 లక్షల కోసం గళ్లాపెట్టలో చూశాడు. అందులో ఉన్న నగదు కనిపించలేదు. ఇది చూసి బోరున విలపించాడు. ఏం చేయాలో తెలియక ఇరుగుపొరుగు షాపుల యజమానులను పిలిచి విచారించాడు. షాపుపైభాగంలో గమనించగా గవాజీ తెరుచుకుని ఉంది. తన షాపులో దొంగలు పడ్డారని భావించి వెంకనే వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను  రప్పించి దొంగల ఆనవాళ్లకోసం గాలించారు.

పోలీసు జాగిలాలు దుకాణం మొత్తం తిరిగి షాపు వెనుక భాగంలో నూతనంగా నిరి్మస్తున్న భవనంలోకి వెళ్లి నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవన యజమానిని విచారించగా బుధవారం నలుగురు కొత్తవారు పనికి వచ్చారని, వారిని మేస్త్రి పంపించారని, వారి వివరాలు తనకు తెలియవని పోలీసులకు తెలిపాడు. అయితే మేస్త్రికి ఫోన్‌ చేసిన పోలీసులకు తాను ఎవరిని పనికి పంపలేదని కూలీలు అందుబాటులో లేక, పని కొన్ని రోజుల నుంచి నిలిపానని సమాధానం ఇచ్చాడు. దీన్ని బట్టి భవననిర్మాణ కారి్మకుల పేరుతో దొంగలు వచ్చి రెక్కీ నిర్వాహించిన అనంతరం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. యజమాని వెంకన్నవర్మ ఫిర్యాదు మేరకు దాదాపు రూ.1.40కోట్లు విలువ చేసే 4 కేజీల బంగారు  ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు అంచనా వేసి  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top