దొంగలను పట్టించిన సీసీ కెమెరా     

Thief Captured - Sakshi

రూ. 22 లక్షల నగదు స్వాధీనం

వివరాలు వెల్లడించిన సీపీ

వర్గల్‌(గజ్వేల్‌) : ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ. 22 లక్షలను పక్కా స్కెచ్‌ ప్రకారం కొట్టేసిన నిందితులను సీసీ కెమెరా ఫుటేజీలు పట్టించాయి. సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ మంగళవారం ఏసీపీ మహేందర్‌తో కలిసి గౌరారం రూరల్‌ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన అరుణోజి నవీన్‌(24) రైటర్‌ సేఫ్‌గార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు.

మరో కస్టోడియన్‌ ప్రవీణ్‌తో కలిసి వివిధ ఏటీఎమ్‌లలో డబ్బులు పెట్టి వస్తాడు. వర్గల్‌ ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టేందుకు వెళ్తుండగా వాటిని కాజేయాలని తన మిత్రుడు ప్రజ్ఞాపూర్‌కు చెందిన మెతుకు ప్రసాద్‌ కుమార్‌ (23)తో కలిసి స్కెచ్‌ వేశాడు. పథకంలో భాగంగా శనివారం నవీన్‌ సెలవు పెట్టాడు. వర్గల్‌ ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టేందుకు శనివారం మధ్యాహ్నం రూ. 22 లక్షల నగదు బ్యాగుతో ఇద్దరు కస్టోడియన్లు ప్రవీణ్‌ కుమార్, మామిడిపల్లి హరికృష్ణ గజ్వేల్‌ నుంచి బయల్దేరారు. వీరిని బైక్‌ మీద అనుసరిస్తున్న ప్రసాద్‌ కుమార్‌ మక్త సమీపంలో డబ్బుల బ్యాగును లాక్కొని పారిపోయాడు. 

ప్రత్యేక బృందం ఏర్పాటు..

సీపీ  ఆదేశాల ప్రకారం అదనపు డిప్యూటీ సీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. వీరు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేశారు. కస్టోడియన్‌ నవీన్‌ సెలవు పెట్టాడని తెలసుకుని మంగళవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మిత్రుడు ప్రసాద్‌కుమార్‌తో కలిసి డబ్బును కాజేసినట్లు అతను వెల్లడించాడు.

దొంగిలించిన నగదును శ్రీగిరిపల్లి గుట్ట ప్రాంతంలో దాచినట్లు చెప్పాడు. ప్రసాద్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.  కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. గౌరారం రూరల్‌ సీఐ శివలింగం, ఎస్సై ప్రసాద్, పీసీలు రామచంద్రారెడ్డి, రాజు, ఉపేందర్‌లకు రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top