మంత్రి గన్‌మన్‌ ఇంట్లో చోరీ

Theft  In The  Minister Gun Man House - Sakshi

బీమారం : మంత్రి చందూలాల్‌ వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న అమృసింగ్‌ ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి... 46వ డివిజన్‌ గోపాలపురంలోని రేణుక,ఎల్లమ్మకాలనీలో నివాసముంటున్న అమృసింగ్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఏఆర్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం మంత్రి చందూలాల్‌ వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

ఇటీవల అమృసింగ్‌ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు మెరుగైనా వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది శనివారం డిశ్చార్జ్‌ అయ్యాడు. కాగా శనివారం అమృసింగ్‌ ఇంటికి చేరడంతో తలుపులు ధ్వంసమైన కనిపించాయి.

లోపలికి వెళ్లగా బీరువా తెరచి ఉంది. దీంతో ఆందోళనకు గురైన అమృసింగ్‌ కుటుంబ సభ్యులు బీరువాను పరిశీలించగా తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, రూ. 26 వేల నగదు అపహరించినట్లు తెలిపారు. దీంతో పాటు బీరువాలో లభ్యమైన వెండి ఆభరణాలను మాత్రం దుండగులు మంచంపై పడేసి వెళ్లారు.

పథకం ప్రకారమే చోరీ..

దుండగులు ఓ పథకం ప్రకారమే చోరీకి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. డాగ్‌ స్వా్కడ్‌ పసిగట్టకుండా ఉండేందుకు ఇంటిలో కారం పొడి చల్లారు. 

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ..

సంఘటన స్థలాన్ని హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌బాబులు సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. అలాగే సంఘటన స్థలం నుంచి వేలిముద్ర నిపుణులు వేలిముద్రలు సేకరించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top