స్కూల్‌ 3వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని | Sakshi
Sakshi News home page

స్కూల్‌ 3వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని

Published Thu, Jul 26 2018 7:44 AM

Tenth Student Suicide Attempt In East Godavari - Sakshi

తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్‌: ఇంద్రపాలెంలోని లిటిల్‌బడ్స్‌ పాఠశాలలో ఓ పదోతరగతి విద్యార్థిని పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. ఎడమ చెయ్యి విరిగిపోయిన ఆమె ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా..ఆమె మాత్రం అందుకు భిన్నంగా పొంతన లేకుండా మాట్లాడుతోంది.   దీనిపై జిల్లా ఉప విద్యాశాఖాధికారిణి దాట్ల సుభద్ర విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.

లిటిల్‌బడ్స్‌లో పదోతరగతి చదువుతున్న కోలా రమ్యశ్రీ రోజూ మాదిరిగా బుధవారం ఉదయం 8 గంటలకే ఆటోలో పాఠశాలకు వచ్చింది. అనంతరం మిగతా విద్యార్థులతో కలిసి, అసెంబ్లీకి వెళ్లకుండా మేడపై భాగానికి వెళ్లి అక్కడ నుంచి దూకేసిందని, దీంతో ఎడమ చెయ్యి విరగ్గా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పాఠశాల యాజమాన్యం చెపుతోంది. ఆమె అలా ఎందుకు చేసిందో  తమకు తెలియదని ప్రిన్సిపాల్‌ ఎస్‌కే ఆలీ డీవైఈవోకు చెప్పారు. చికిత్స పొందుతున్న రమ్యశ్రీని అడిగితే భవనం పైభాగానికి వెళ్లానని, అక్కడ కళ్లు తిరగడంతో కిందకి పడిపోయానని ఒకసారి, మేడపై నుంచి కిందికి ఎవరో తోసేశారని ఇంకోసారి చెప్పింది. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరా ఫుటేజ్‌లను డీవైఈఓ పరిశీలించారు. అయితే రమ్యశ్రీ మేడపై  నుంచి దూకిన దృశ్యం రికార్డు కాలేదు.

కలెక్టర్‌కు నివేదిక ఇస్తా: డీవైఈఓ
పాఠశాల డైరెక్టర్‌ పీఎస్‌ఎన్‌ మూర్తిని, ప్రిన్సిపాల్‌  ఆలీని డీవైఈఓ ప్రశ్నించారు. పాఠశాల జిల్లా విద్యాశాఖ కామన్‌బోర్డు నిబంధనల ప్రకారం పనిచేయడంలేదని, వారికి ఇష్టం వచ్చిన సమయంలో పాఠశాల అసెంబ్లీ నిర్వహిస్తున్నారని, ఉదయం 8 గంటలకే పాఠశాల ప్రారంభిస్తున్నారని డీవైఈఓ సుభద్ర విలేకరులకు వివరించారు. ఈ పాఠశాలపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుత సంఘటన నేపథ్యంలో విచారణ జరిపి పూర్తి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా కలెక్టర్‌కు ఇస్తానని చెప్పారు. కాగా ఈ ఘటనపై ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కడుపునొప్పి రావడంతో భవనంపైకి వెళ్లి, కళ్లు తిరగడంతో అక్కడి నుంచి పడిపోయానని రమ్యశ్రీ చెప్పిందని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి.రామారావు తెలిపారు.

Advertisement
Advertisement