సౌదీ నుంచి పోస్టులో భార్యకు తలాక్‌!

Talak to wife in post from Saudi - Sakshi

మామ అక్రమాలను నిలదీసినందుకే...

నగరంలోని పాతబస్తీలో ఘటన

కోడలు సహా 25 మంది పేరిట బోగస్‌ ఖాతాలు తెరిచిన మామ

వాటి ద్వారా నాలుగేళ్లుగా గ్యాస్‌ సబ్సిడీ స్వాహా

ప్రశ్నించినందుకు కొడుకు చేత తలాక్‌ ఇప్పించిన వైనం

సాక్షి హైదరాబాద్‌: బోగస్‌ పత్రాలతో కోడలు సహా 25 మంది పేరిట బ్యాంకు ఖాతాలు, గ్యాస్‌ కనెక్షన్‌లు తీసుకొని వాటి ద్వారా ప్రతి నెలా వంట గ్యాస్‌ సబ్సిడీ కాజేయడమే కాకుండా దీనిపై నిలదీసిన కోడలికి కొడుకు చేత తలాక్‌ ఇప్పించిన ఉదంతం నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం సైదాబాద్‌కు చెందిన మహ్మద్‌ రహ్మన్‌ కూతురు నస్రీన్‌కు ఫలక్‌నుమా పోలీస్టేషన్‌ పరిధిలో ఉంటున్న మహ్మద్‌ యూసుఫ్‌ కుమారుడు మహ్మద్‌ అలీకి 2014లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు సౌదీ అరేబియాలో వెళ్లిపోయారు. 

నకిలీ ఖాతా తెరిచి... 
ఇటీవల అనారోగ్యానికి గురైన నస్రీన్‌ వైద్యం కోసం హైదరాబాద్‌ వచ్చింది. చికిత్స ఖర్చుల కోసం భర్తను డబ్బు పంపాలని కోరింది. దీంతో భర్త.. జహానుమాలోని సిండికేట్‌ బ్యాంకులో నస్రీన్‌ పేరిట ఉన్న ఖాతాలోంచి సొమ్ము తీసుకోవాల్సిందిగా భార్యకు సూచించాడు. అయితే తనకు ఖాతా లేకున్నా ఆ బ్యాంకులోకి సొమ్ము ఎలా వచ్చిందని మామ మహ్మద్‌ యూసఫ్‌ను అడగ్గా ఆయన అదేమీ చెప్పకుండానే డబ్బును బ్యాంకు నుంచి తీసుకొచ్చి కోడలికి ఇచ్చాడు. దీనిపై అనుమానం వచ్చిన నస్రీన్‌... ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు పరిశీలించగా 2014లో తన పేరిట బోగస్‌ పత్రాలతో తెరిచినట్లు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా 2014 నుంచి ఆ ఖాతాలో తన భర్త జమ చేస్తున్న సొమ్మును మామ కాజేసిట్లు తెలుసుకుంది. అలాగే తన పేరిట, తోటికోడళ్లు, ఇతర మహిళల పేరిట బోగస్‌ పత్రాలతో 25 బ్యాంకు ఖాతాలను తెరిచి వాటి ద్వారా గ్యాస్‌ కనెక్షన్లను మామ సంపాదించాడని నస్రీన్‌ తెలుసుకుంది. ఈ కనెక్షన్ల పేరిట ప్రతి నెలా గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకొని అక్రమంగా సబ్సిడీ సొమ్మును పొందుతున్నట్లు ఆమె గుర్తించింది.

పోస్టులో తలాక్‌..: ఈ అక్రమాలకు తన పేరును ఎందుకు వాడుకున్నావంటూ మామను నిలదీయగా సౌదీలో ఉన్న కొడుకుకు లేనిపోనివి చెప్పి పోస్టు ద్వారా తలాక్‌ ఇప్పించాడని నస్రీన్‌ ‘సాక్షి’కి తెలిపింది. మామపై ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా 14న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని వివరించింది. తాను జూలై 11న సౌదీ నుంచి వస్తే సెప్టెంబర్‌ 24న అందిన తలాక్‌ లేఖలో జూలై 2వ తేదీన తనకు తలాక్‌ ఇచ్చినట్లు భర్త అందులో పేర్కొన్నాడని బాధితురాలు చెప్పింది. తన పిల్లలు సౌదీలోనే ఉన్నారని, మామ, భర్త కలసి తన జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. మహ్మద్‌ యూసఫ్‌ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. మరణించిన అల్లుడి పిల్లలను తన పిల్లలుగా చూపుతూ వారి పేరిట నకిలీ పాస్‌పోర్టులను తయారు చేసి గతంలో తాను పని చేసిన సౌదీ కంపెనీ నుంచి ఆర్థిక సాయం కూడా పొందాడని తెలిపింది. తనకు న్యాయం చేస్తానని పోలీసు కమిషనర్‌ హామీ ఇచ్చారని నస్రీన్‌ వివరించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top