ఎయిర్‌హోస్టెస్‌పై లైంగిక వేధింపులు..

Suresh Prabhu Orders immediate Probe On Air India Employee Molestation Case  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియాలో లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగి ఫిర్యాదు నేపథ్యంలో దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించాలని సీనియర్‌ అధికారులను పౌర విమానయాన మంత్రి సురేష్‌ ప్రభు మంగళవారం ఆదేశించారు. ఈ ఘటనను సత్వరం పరిష్కరించాలని ఎయిర్‌ఇండియా సీఎండీని కోరారని, అవసరమైతే మరో కమిటీని నియమించాలని ఆదేశించానని సురేష్‌ ప్రభు ట్వీట్‌ చేశారు. లైంగిక వేధింపులపై తాను చేసిన ఫిర్యాదు పట్ల ఎయిర్‌ఇండియా అంతర్గత కమిటీ విచారణ తీరును సంస్థకు చెందిన మహిళా ఉద్యోగి తప్పుపడుతూ ట్వీట్‌ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ మేరకు స్పందించారు.

ఎయిర్‌ ఇండియా సీనియర్‌ ఉద్యోగి తనను ఆరేళ్ల పాటు లైంగికంగా వేధించారని, తన ఫిర్యాదుపై సంస్థ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఎయిర్‌హోస్టెస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, ఆ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, తన పట్ల వివక్ష ప్రదర్శించారని పౌరవిమానయాన మంత్రి సురేష్‌ ప్రభుకు రాసిన లేఖలో బాధితురాలు ఆరోపించారు. తన కోరికను తీర్చలేదన్న కోపంతో ఆయన తనకు అధికారికంగా దక్కాల్సిన ప్రయోజనాలను కల్పించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

ఇతర మహిళా సహోద్యోగులకు సైతం ఇదే అనుభవం ఎదురైందని ఆమె పేర్కొన్నారు. అంతర్గత విచారణలో అధికారి తీరుపై తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తన ఫిర్యాదుపై ఆయనను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ అనుమతించలేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుడికి రాజకీయ పలుకుబడి ఉందని, అతడిని కఠినంగా శిక్షించేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ చొరవ చూపాలని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top