తల్లి మందలించిందని.. | Student Suicide In Nizamabad | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని..

Dec 27 2018 8:10 AM | Updated on Dec 27 2018 8:10 AM

Student Suicide In Nizamabad - Sakshi

నిఖిల్‌కుమార్‌ (ఫైల్‌)

డిచ్‌పల్లి, నిజామాబాద్‌: తల్లి మందలించిందని మనస్థాపంతో నిఖిల్‌కుమార్‌(19) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై ప్రణయ్‌కుమార్, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొక్కుల పాండు, మంజుల దంపతులకు ఒక కొడుకు నిఖిల్‌కుమార్, ఒక కూతురు ఉన్నారు. కొన్ని కారణాలతో మంజుల తన కొడుకు, కూతురుతో కలిసి ధర్పల్లి మండల కేంద్రంలో నివసిస్తుంది. ఇంటర్‌ చదివిన నిఖిల్‌కుమార్‌ డిచ్‌పల్లిలోని ఎస్‌బీఐ కస్టమర్‌ సేవా కేంద్రంలో పని చేస్తున్నాడు. సుమారు నెల క్రితం తల్లి మంజుల వద్ద రూ.5వేలు తీసుకుని ధర్పల్లికి చెందిన స్నేహితుడికి అవసరం నిమిత్తం అప్పుగా ఇచ్చాడు. వారం రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన స్నేహితుడు నెలరోజులైనా ఇవ్వలేదు. దీంతో మంగళవారం ఉదయం తల్లి మంజుల డబ్బుల విషయమై కొడుకును మందలించింది. డబ్బులు తీసుకున్న స్నేహితుడి ఫోన్‌ నంబరు ఇవ్వాలని, తానే డబ్బులు అడుగుతానని చెప్పింది.

తల్లి మందలించడంతో కోపంతో నిఖిల్‌ చేతిలోని ఫోన్‌ పగులగొట్టాడు. కొద్దిసేపటికి మంజుల పనికోసం బయటకు వెళ్లింది. తల్లి బయటకు వెళ్లగానే తానూ బయటకు వెళ్లిన నిఖిల్‌ సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో చెల్లెలితో మాట్లాడి తిరిగి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 8.30 గంటలకు తన స్నేహితుడికి లాస్ట్‌ బాయ్‌ బాయ్‌ టాటా అంటూ మెసేజ్‌ చేశాడు. దీంతో కంగారు పడిన స్నేహితుడు నీవు ఎక్కడున్నావని నిఖిల్‌కు మెసేజ్‌ పంపగా రిప్లయ్‌ ఇవ్వలేదు. మరో స్నేహితుడు ఫోన్‌ చేస్తే తాను రైలు పట్టాలపై ఉన్నానని చెప్పిన నిఖిల్‌ ఫోన్‌ పెట్టేశాడు. ఇద్దరు స్నేహితులు ఈ విషయమై 100 నంబరుకు కాల్‌ చేశారు.

వెంటనే స్పందించిన ధర్పల్లి హెడ్‌కానిస్టేబుల్‌ మోతీరాం సమాచారం ఇచ్చిన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇందల్వాయి రైల్వేస్టేషన్‌కు చేరుకుని పట్టాల వెంట రాత్రి పది గంటల వరకు వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. నిఖిల్‌కు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకుండా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకోవడంతో చేసేది లేక వారు వెనుదిరిగారు. అర్ధరాత్రి 2.30 గంటలకు నైట్‌ పెట్రోలింగ్‌ టీం సభ్యులకు డిచ్‌పల్లి మండలం ఎఫ్‌సీఐ గోడౌన్స్‌ వెనుక మంగళి వాగు వంతెన వద్ద నిఖిల్‌ మృతదేహాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. రైల్వే ఎస్సై ప్రణయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్‌ గంగమోహన్‌ తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహం వద్ద లభించిన సెల్‌ పోన్‌ ద్వారా కుటుంబీకులకు సమాచారం అందజేశారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద నిఖిల్‌ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులతోపాటు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తల్లి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement