ఆశలు చిదిమేసిన బస్సు

Student Killed In Visakha Bus Accident - Sakshi

 రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

 కారు షెడ్‌ కూడలి వద్ద దుర్ఘటన

సాక్షి, పీఎం పాలెం(భీమిలి): పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటుందనగా ఓ విద్యార్థిని బస్సు చక్రాలకు బలైపోయింది. అంత వరకూ తోటి విద్యార్థులతో ఆనందంగా గడిపి తిరిగిరాని లోకాలకు అర్ధంతరంగా వెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన నిత్యం రద్దీగా ఉండే కారుషెడ్‌ కూడలి వద్ద గురువారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో గాడి స్పందన అనే విద్యార్థిని తనువు చాలించింది. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ బీ – 2లో గాడి శంకరరావు, భార్య లక్ష్మి, కుమార్తెలు స్పందన(16), కల్యాణిలతో నివసిస్తున్నాడు. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమార్తె స్పందన రామాటాకీస్‌ సమీపంలోని ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతుండగా రెండో కుమార్తె కల్యాణి 8వ తరగతి చదువుతోంది.

ఈ నేపథ్యంలో కళాశాల నుంచి స్నేహితులతో కలిసి కారుషెడ్‌ కూడలిలో స్పందన గురువారం సాయంత్రం బస్సు దిగింది. పీఎంపాలెం ఆఖరు బస్టాపునకు వెళ్లే సిటీ బస్సుకోసం స్నేహితురాళ్లతో కారుషెడ్‌ కూడలి శివాలయం సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఎదురుచూస్తోంది. సాయంత్రం 5 గంటల సమయంలో పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు వెళ్లే సిటీ బస్సు రావడంతో దాన్ని అందుకోవడానికి స్నేహితులతో కలిసి కదిలింది. ఈ క్రమంలో కాలు తన్నుకోవడంతో అదుపు తప్పి పీఎంపాలెం ఆఖరు బస్టాపునకు వెళ్లే వన్‌వే ట్రాఫిక్‌ రోడ్డు మీద పడి పోయింది. అదే సమయంలో సిటీ బస్సు రావడంతో తల భాగం బస్సు కింద నలిగి ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది.  ఈ ఘటనతో అంత వరకూ తమతో కబుర్లు చెప్పిన స్పందన కళ్ల ముందే దుర్మరణం చెందడంతో ఆమె స్నేహితురాళ్లు హతాశులయ్యారు. భయాందోళనతో కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు ఎక్కి పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటుందనగా జరిగిన దుర్ఘటనతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పీఎం పాలెం పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top