బ్రెడ్‌ ప్యాకెట్ల మధ్యలో కరెన్సీ కట్టలు

Smuggling bid foiled at Hyd airport, 2 held with foreign money - Sakshi - Sakshi

దుబాయ్‌కు విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు యత్నం

ఇద్దరిని పట్టుకున్న పోలీసులు, కస్టమ్స్‌ అధికారులు

రూ.3.96 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు నగర పోలీసులు చెక్‌ పెట్టారు. భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పాతబస్తీ వాసుల్ని అరెస్టు చేసి, వీరి నుంచి రూ.3.96 కోట్ల విలువైన ఏడు దేశాల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన స్ప్రే పెయింటర్‌ రవూఫ్‌ భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని దుబాయ్‌కి తరలిస్తున్నట్లు దక్షిణ మండల టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అం దింది. దీంతో నిఘా ఉంచిన అధికారులు రవూఫ్‌ బుధవారం అరబ్‌ ఎమిరేట్స్‌ విమానం ఎక్కుతు న్నట్లు గుర్తించారు.

అప్పటికే అతడు తన లగేజ్‌ను చెక్‌ ఇన్‌లో వేసి ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ కౌంటర్లు దాటి నట్లు నిర్థారించుకున్నారు. విమానాశ్రయం లోపలకు వెళ్లి చర్యలు తీసుకునే అధికారం టాస్క్‌ఫోర్స్‌కు లేకపోవడంతో కస్టమ్స్‌ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ సిబ్బంది రవూఫ్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు లగేజ్‌ బెల్ట్‌పై ఉన్న బ్యాగ్‌ను వెనక్కు రప్పించారు. దాన్ని తెరిచి చూడగా అందులోని ఆరు కట్టల్లో ఏడు దేశాలకు చెందిన కరెన్సీ లభించింది.

ఈ బండిళ్లను రవూఫ్‌ బ్రెడ్, బిస్కెట్‌ ప్యాకెట్ల మధ్యలో ఉంచినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. వాటిలో అమెరికన్‌ డాలర్లు, యూరోలతో పాటు సౌదీ, కువైట్, బెహరేన్, ఒమన్‌ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. తనకు ఈ డబ్బును మొఘల్‌పురకే చెందిన మెహరేన్‌ అందించాడని, దుబాయ్‌లో ఉండే అబ్దుల్లాకు చేరిస్తే రూ.15 వేల కమీషన్, విమాన టిక్కెట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని రవూఫ్‌ అంగీకరించాడు.

మెహరేన్‌ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనను దించి వెళ్లినట్లు ఇతడు చెప్పాడు.దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెహరేన్‌ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. రవూఫ్‌తోనే ఫోన్‌ చేయించి అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయం నుంచి పహాడీషరీఫ్‌ వెళ్లే మార్గంలో ఓ హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద అతడు ఉన్నట్లు గుర్తించారు. అయితే అతడు రవూఫ్‌నే క్యాబ్‌లో రమ్మని చెప్పి.. ఆ వాహనం నంబర్‌ తెలుసుకుని ఫాలో అవడం ప్రారంభించాడు.

దీంతో సిటీ శివార్ల వరకు రహస్యంగా వెంబడించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా మెహరేన్‌ను అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ నగదు మెహరేన్‌ సొంతం కాదని, కొందరు వ్యాపారుల వద్ద తీసుకుని 3 శాతం కమీషన్‌కు ఆశపడి దుబాయ్‌కు పంపుతున్నట్లు బయటపడింది. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సైతం ఈ రాకెట్‌ మూలాలు కనుక్కోవడంపై దృష్టి పెట్టారు. ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ ఏఏ మార్గాల్లో సిటీకి వచ్చిందనే అంశాలనూ ఆరా తీస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top