ఆడుకుంటూ వెళ్లి.. స్తంభాన్ని పట్టుకుని.. 

Six Years Old Boy Died With Electrocution At Park In Hyderabad - Sakshi

విద్యుదాఘాతంతో బాలుడి మృతి 

హైదరాబాద్‌ ఫెబల్‌ సిటీలో ఘటన 

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంపై అపార్ట్‌మెంట్‌వాసుల ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సరఫరా నిర్వహణ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫుట్‌పాత్‌ పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్‌ఘాతానికి గురై ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీరంచెరువు పీబీఈఎల్‌ సీటీ (ఫెబల్‌ సిటీ)లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన దివాకర్‌ హైటెక్‌ సిటీ ప్రాంతంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య, కుమారుడు మోనీష్‌(7)తో కలిసి ఫెబల్‌ సిటీలోని ఈ–బ్లాక్‌ 12వ అంతస్తు 8వ నెంబర్‌ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. మోనీష్‌ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం అపార్ట్‌మెంట్‌లోని తోటి పిల్లలతో కలిసి లాన్‌లో ఆడుకునేవాడు.

సోమవారం కూడా ఆడుకోవడానికి కిందకు వచ్చాడు. ఈ క్రమంలో ఆడుతూ ఆడుతూ వెళ్లి ఫుట్‌పాత్‌ పక్కనే ఉన్న వీధిదీపం స్తంభాన్ని పట్టుకున్నాడు. దాని కింది భాగంలో విద్యుత్‌ వైరు పాడై ఉండటంతో స్తంభానికి కరెంటు సరఫరా అవుతోంది. దీంతో మోనీష్‌ విద్యుత్‌ఘాతానికి గురై నిమిషంపాటు అలాగే ఉండిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతోపాటు వాకింగ్‌ చేస్తున్నవారు ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. నిమిషం తర్వాత మోనీష్‌ కింద పడిపోయాడు. వెంటనే చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా..అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనతో ఆందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. బిల్డర్‌తో పాటు కాంట్రాక్టర్లను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పీబీఈఎల్‌ సిటీ నిర్వాహకులు నివారణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న భూగర్భ కేబుల్‌ వైర్లకు టేపులు చుట్టారు.
స్తంభం వద్దకు వెళ్తూ...

విద్యుత్‌ఘాతానికి గురై అలాగే ఉండిపోయిన మోనీష్‌

పోస్టుమార్టానికి తండ్రి ససేమిరా...
మోనీష్‌ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులు సోమవారం రాత్రే తమ స్వస్థలం చెన్నై తీసుకెళ్లారు. అయితే, ఇక్కడ కేసు నమోదు చేయడానికి పోస్టుమార్టం నివే దిక అవసరం కావడంతో పోలీసులు మోనీష్‌ తండ్రి దివాకర్‌ను సంప్రదించారు. అయితే, తన కుమారుడికి పోస్టుమార్టం చేయించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. దీంతో అపార్ట్‌మెంట్‌వాసులు దివాకర్‌తో మాట్లాడి ఒప్పించారు. అనంతరం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఐదు రోజుల్లో వస్తుందని వెల్లడించారు. ఈ కేసులో బిల్డర్, అసోసియేషన్, విద్యుత్‌ సరఫరా కాంట్రాక్టర్‌పై కేసులు నమోదుచేసినట్లు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top