అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్‌ 

SI Arrested For Demanding 3 Lakh Bribe For Land Dispute - Sakshi

కబ్జాదారుడికి సహకరించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ అరెస్ట్‌ 

తహసీల్దార్‌ ఇంట్లోనూ సోదాలు  

సాక్షి, జూబ్లీహిల్స్‌ :  భూ ఆక్రమణ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు డిమాండ్‌ చేసినందుకుగాను బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రవీందర్‌ నాయక్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.  వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 14లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాలీద్‌ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై షేక్‌పేట మండల తహసీల్దార్‌ సుజాత గత ఏప్రిల్‌ 30న బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఖాలీద్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు గాను రూ. 3 లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ రవీందర్‌ డిమాండ్‌ చేశాడు.(లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్‌ఐ)

ఖాలీద్‌ ఇటీవల రూ.1.50 లక్షలు రవీందర్‌ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు. అందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులకు అందించిన ఖాలీద్‌ అతను మరో రూ. 3 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు షేక్‌పేట మండల కార్యాలయం, ఆర్‌ఐ నివాసం, తహసీల్దార్‌ ఇంట్లో, ఎస్‌ఐ రవీందర్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా అర్థరాత్రి వరకు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. అర్థరాత్రి రాత్రి 12 గంటలకు తహసిల్దార్ సుజాతను ఇంటికి పంపించారు. నేడు కూడా ఈ కేసుకు సంబంధించి తహిసిల్దార్‌ సుజాతను విచారించనున్నారు. ఎస్‌ఐ రవీందర్‌పై  కేసు నమోదు చేసిన పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజు కూడా తహసిల్దార్ సుజాతను విచారించనున్న ఏసీబీ అధికారులు.

అసలు ఏం జరిగిదంటే.. 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14 సర్వే నంబర్‌ 129/59లో ఉన్న  4865 గజాల ప్రభుత్వ స్థలాన్ని సయ్యద్‌ అబ్దుల్‌ ఖాలిద్‌ అనే వ్యక్తి ఆక్రమించి హెచ్చరిక బోర్డును తొలగించి తన పేరుతో  బోర్డు ఏర్పాటు చేశాడు. సదరు స్థలాన్ని తాను కోర్టులో గెలిచినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ స్థలాన్ని తన పేరిట క్రమబద్దీకరించి హద్దులు చూపించాల్సిందిగా షేక్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో తహసిల్దార్‌ సుజాత గత జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్థలాన్ని  ప్రైవేట్‌ పరం చేస్తూ హద్దులు చూపిస్తానంటూ అదే కార్యాలయంలో పని చేస్తున్న ఆర్‌ఐ నాగార్జున రెడ్డి ఖాలిద్‌ నుంచి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడు.

ఇందులో భాగంగా శనివారం ఖాలిద్‌ రూ.15 లక్షల నగదును సాగర్‌సొసైటీ రోడ్డులో హార్లి డేవిడ్‌ సన్‌ షోరూం పక్క సందులో నాగార్జున్‌ రెడ్డికి ఇస్తుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాగార్జునరెడ్డి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు యూసుఫ్‌గూడలోని అతడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. నిందితుడిని కార్యాలయానికి తీసుకువచ్చి విచారించగా కలెక్టరేట్‌లో ఓ అధికారికి రూ. 15 లక్షలు ఇవ్వాల్సి ఉందని అందుకే రూ.30 లక్షలు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top