గోల్‌మాల్‌..!

senior assistance cheat staff nurse in sarvajana hospital - Sakshi

స్టాఫ్‌నర్సును బురిడీ కొట్టించిన ఘనుడు  

రూ.50 వేలు స్వాహా చేసిన సూపరింటెండెంట్‌

ఆర్‌డీకి సరెండర్‌ చేసిన ఆస్పత్రి యాజమాన్యం

సర్వజనాస్పత్రి కార్యాలయంలోని ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ స్టాఫ్‌నర్సును బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్టాఫ్‌నర్సుకు చెందిన రూ. 50 వేల చలానా కట్టినట్లు ఫోర్జరీ చేశాడు. ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా సదరు సీనియర్‌ అసిస్టెంట్‌పై విచారణకు ఆదేశించి ఆర్‌డీకు సరెండర్‌ చేసింది.

అనంతపురం న్యూసిటీ:అనంతపురం సర్వజనాస్పత్రిలోని సునీత అనే స్టాఫ్‌నర్సు గతేడాది నవంబర్‌లో ఎమ్మెస్సీ పరీక్షల కోసం సెలవు పెట్టారు. ఆ నెల జీతం డిసెంబర్‌లో స్టాఫ్‌నర్సు ఖాతాలో జమ అయ్యింది. ఈమె సెలవులో వెళ్లిన విషయాన్ని ఆలస్యంగా కార్యాలయం సిబ్బందికి తెలియజేశారు. గత నెల జీతం అకౌంట్‌లో పడిందని తెలియజేశారు. దీంతో సీనియర్‌ అసిస్టెంట్‌ అల్తాఫ్‌ ఆ మొత్తాన్ని తనకిస్తే చలానా రూపంలో ట్రెజరీకి చెల్లిస్తామన్నారు. స్టాఫ్‌నర్సు సునీత రూ.55 వేల నగదును సీనియర్‌ అసిస్టెంట్‌కు అందజేశారు. సీనియర్‌ అసిస్టెంట్‌ రూ. 5వేలు మాత్రమే చెల్లించి, రూ.50 వేలు తీసుకున్నాడు. ట్రెజరీకు చెల్లించిన స్లిప్‌ను స్టాఫ్‌నర్సుకు అందజేశాడు. ఆ స్లిప్‌లో అంకెలను దిద్దిన విషయాన్ని పసిగట్టిన స్టాఫ్‌నర్సు వెంటనే ఏఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం సూపరింటెండెంట్‌ దృష్టికి వెళ్లగా.. ఆయన విచారణకు ఆదేశించారు. సీనియర్‌ అసిస్టెంట్‌ తప్పిదం చేసినట్లు విచారణలో తేలడంతో ఆయన్ను కడపలోని ఆర్‌డీ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. 

పైసలిస్తేనే పనులు! : సర్వజనాస్పత్రిలోని ఆఫీస్‌ కార్యాలయంలో పైసలివ్వందే పనులు జరగడం లేదు. పది మంది స్టాఫ్‌నర్సుల ఇంక్రిమెంట్ల ఫైల్‌ ఆర్‌డీ కార్యాలయానికి పంపడంలోనూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఒక్కో స్టాఫ్‌నర్సుతో రూ.3 వేలు లంచం తీసుకున్నట్లు తెల్సింది. ఆస్పత్రి కార్యాలయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారిపోయాయి. పర్యవేక్షించాల్సిన యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని చర్చించుకుంటున్నారు. 

వాస్తవమే  
సీనియర్‌ అసిస్టెంట్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌ స్టాఫ్‌నర్సు సునీత వేతనాన్ని తీసుకున్న మాట వాస్తవమే. ట్రెజరీకి రూ.5వేలు మాత్రమే చెల్లించాడు. దీనిపై విచారణకు ఆదేశించి సదరు ఉద్యోగిని ఆర్‌డీకి సరెండర్‌ చేశాం.         – డా.జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top