ఉమ్రా ముసుగులో ఘరానా మోసం

Scam in the name of Umra Tour - Sakshi

     పోలీసుల అదుపులో కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ చైర్మన్‌

       తక్కువ మొత్తంతో పవిత్రయాత్రకు పంపిస్తానని వసూళ్లు  

     దగా చేసి విదేశాలకు పారిపోయేందుకు సన్నాహాలు

     బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి..

ప్రొద్దుటూరు క్రైం :  ‘రెండు రోజుల్లో కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ చైర్మన్‌ విదేశాలకు చెక్కేసేవాడు. అదృష్టం కొద్దీ ఈ విషయం మాకు తెలిసింది.. లేదంటే బాధితులు మాపై దాడి చేసేవారు’ కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు ఆపరేటర్లు పోలీసుల వద్ద స్వయంగా అన్న మాటలు ఇవి. తక్కువ మొత్తంతో ఉమ్రా (పవిత్ర యాత్ర)కు పంపిస్తానని కేఎస్‌ఎస్‌ ట్రావల్స్‌ తరఫున పెద్ద సంఖ్యలో వసూళ్లు చేసి దగా చేయబోయిన సయ్యద్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌ అబిది వ్యవహారం బట్టబయలైంది. వైఎస్‌ఆర్‌ జిల్లాలోని కడప కేంద్రంగా చేసుకొని దేశవ్యాప్తంగా కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ బ్రాంచ్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది జనవరి 16 నుంచి ఉమ్రా కోసం ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు. వచ్చే ఏడాదిలో వెళ్లాలనుకునే వారి నుంచి రూ.14 నుంచి 25 వేలు, త్వరగా వెళ్లాలనుకునే వారి నుంచి రూ. 30– 35 వేలు వసూలు చేశారు. ఇక రంజాన్‌ నెలలో ఉమ్రా చేయాలనుకునే వారు రూ.60 వేలకు పైగా చెల్లించాల్సి వస్తుంటుంది. అయితే కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ వారు మాత్రం రూ.35 వేల నుంచి 40 వేలకే తీసుకెళతామని ప్రచారం చేయడంతో.. చాలా మంది బుక్‌ చేసుకున్నారు. అయితే రంజాన్‌ వచ్చేసినా ఏ తారీఖున పంపిస్తారన్నది తేల్చలేదు. హెడ్‌ ఆఫీసు నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం లేదని స్థానిక ఉద్యోగులు చెప్పారు. అయితే  డబ్బు చెల్లించిన వారి నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు ఉమ్రాకు వెళ్లే తేదీలను మార్చడంతో సిబ్బందికి సైతం సందేహాలు మొదలయ్యాయి. 

సిబ్బంది సాయంతో కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ మోసాలు వెలుగులోకి
కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ చైర్మన్, భాగస్వాములు కలిసి దేశం విడిచి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆపరేటర్లకు సమాచారం అందింది. వాళ్లు విదేశాలకు వెళ్తే ఉమ్రా బాధితులు తమను చంపేస్తారని భావించారు. ఈ క్రమంలోనే చైర్మన్‌ ఉద్ద ఉన్న ఆపరేటర్‌ సలహా మేరకు అంతా సమావేశమై చర్చించి ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సూచనల మేరకు పక్కా ప్రణాళికతో బెంగళూరులో ఉన్న చైర్మన్, ఇతర భాగస్వాములను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆపరేటర్లు, సబ్‌ ఏజెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా చైర్మన్‌కు సంబంధించిన వ్యక్తులు తరచూ తమకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆపరేటర్లు వాపోతున్నారు.  

ఎంఐఎం ఆలీ ఎవరో మాకు తెలియదు..
పోలీసుల అదుపులో ఉన్న ఎంఐఎం ఆలీ ఎవరో తమకు తెలియదని ఆపరేటర్లు అంటున్నారు. అతనికి చైర్మన్‌ అల్తాఫ్‌హుస్సేన్‌ అబిదితో ఉన్న సంబంధం కూడా తెలియదని అంటున్నారు. ‘ఎంఐఎం ఆలీ బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని అనేక సార్లు మా చైర్మన్‌ మాతో అనే వారు.. కొన్ని రోజుల క్రితం కూడా ట్రావెల్స్‌ డబ్బును అతను తీసుకున్నాడు.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయండని మా చైర్మన్‌ చెప్పారు’ అని ఆపరేటర్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. ఈ కారణంతోనే ఆలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top